Corona Virus: ఆ రెండు రాష్ట్రాల్లోనే కేసుల పెరుగుదల.. 8 రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వస్తోందని, అయితే ఒక్క కేరళ, మిజోరం రాష్ట్రాల్లో మాత్రం కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య

Published : 03 Feb 2022 17:19 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వస్తోందని, అయితే ఒక్క కేరళ, మిజోరం రాష్ట్రాల్లో మాత్రం కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు కూడా అత్యధికంగా ఉందని తెలిపింది. వ్యాక్సిన్ల కారణంగా ఈసారి మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిస్తోందని పేర్కొంది. 16 రాష్ట్రాల్లో 100శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కేరళ, మిజోరంల్లో మాత్రమే..

దేశంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖ నేడు మీడియా సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని, దీన్ని బట్టి చూస్తే మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోందని తెలిపింది. 34 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. అయితే కేరళ, మిజోరంల్లో మాత్రం కరోనా కేసులు, పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదవుతున్నట్లు వెల్లడించింది. 297 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికి పైన ఉండగా.. 169 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతంగా ఉన్నట్లు తెలిపింది. 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువే ఉందని చెప్పింది. 8 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50వేలకు పైనే ఉందని తెలిపింది. మరో 12 రాష్ట్రాల్లో 10 వేల నుంచి 50వేల మధ్యలో క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ వల్ల ఈ సారి మరణాల రేటు తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే గత దశలతో పోలిస్తే తాజా ఉద్ధృతిలో 44ఏళ్ల సగటు వయసు వారే అధికంగా వైరస్‌ బారిన పడినట్లు పేర్కొంది.

16 రాష్ట్రాల్లో తొలి డోసు పూర్తి..

ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 18ఏళ్లు పైబడిన 100శాతం మంది అర్హులకు తొలి డోసు పూర్తయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గుజరాత్‌లో 99శాతం మందికి రెండో డోసు కూడా అందినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో 98శాతం, లద్దాఖ్‌లో 97శాతం, రాజస్థాన్‌లో 97శాతం మంది వయోజనులకు రెండు డోసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించింది. 15-18 ఏళ్ల వయసు వారిలో 65శాతం మందికి తొలి డోసు అందించినట్లు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని