Lalu Prasad: లాలూను వెంటాడుతోన్న దాణా కుంభకోణం.. ఐదో కేసులోనూ దోషి!

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దాణా కుంభకోణం కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.

Published : 15 Feb 2022 13:20 IST

తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

రాంచీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దాణా కుంభకోణం కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా దాణా కుంభకోణానికి సంబంధించి రూ.139 కోట్ల వ్యవహారంలో నమోదైన కేసులో లాలూను ఝార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. దీంతో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆర్‌జేడీ చీఫ్‌ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు దాణా కుంభకోణంలో నమోదైన ఐదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్‌ దోషిగా తేలడం గమనార్హం.

మూడున్నరేళ్లు జైలులోనే..

బిహార్‌లో 1996లో దాణా కుంభకోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.950 కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. అక్కడి పశుసంవర్ధక శాఖ నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించారనే ఆరోపణలు వచ్చాయి. 1991 నుంచి 1996 వరకు పలు దఫాల్లో విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 1997లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ కోర్టు నిందితుడిగా చేర్చింది. 2013 సెప్టెంబర్‌లో లాలూను ట్రయల్‌ కోర్టు దోషిగా తేల్చింది. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌లో ఆయనకు బెయిల్‌ లభించింది. తర్వాత మరికొన్ని కేసుల్లో శిక్ష పడడంతో 2017 డిసెంబర్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు (దాదాపు మూడున్నరేళ్లు) లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలులోనే ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో ఐదో కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 29నాటికి వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు వెలువరించిన ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడం గమనార్హం.

ఐదు కేసుల్లోనూ దోషి..

ఛాయ్‌బాసా ట్రెజరీ నుంచి రూ.37.3కోట్లు ఒకసారి, రూ. 33.13కోట్లు మరోసారి అక్రమంగా డ్రా చేయడంపై కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు దియోఘర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27 కోట్లతోపాటు దుంకా ట్రెజరీ నుంచి మరో రూ.3.76కోట్లను అక్రమంగా డ్రా చేశారు. ఈ నాలుగు కేసుల్లోనూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. తాజాగా రూ.139 కోట్లకు సంబంధించిన ఐదో కేసులోనూ ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మునుపటి కేసుల్లో మొత్తం ఆయనకు 14ఏళ్ల శిక్ష పడగా.. మొన్నటివరకు ఆయన జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఆయనకు బెయిల్‌పై బయటకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని