Kiren Rijiju: స్వేచ్ఛగా మాట్లాడుతూనే భావప్రకటన లేదంటున్నారు

దేశంలో భావప్రకటన స్వేచ్ఛ కొరవడిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు.

Published : 04 Sep 2022 23:17 IST

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి వ్యాఖ్యలపై మండిపడ్డ న్యాయశాఖ మంత్రి

దిల్లీ: దేశంలో భావప్రకటన స్వేచ్ఛ కొరవడిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ (Justice B N Srikrishna) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ( Kiren Rijiju) మండిపడ్డారు. ప్రజా మద్దతు కలిగిన ప్రధానమంత్రినే ఎటువంటి ఆంక్షలు లేకుండా నిత్యం నిందించే వ్యక్తులే భావప్రకటన స్వేచ్ఛ లేదని చెప్పడం విడ్డూరమన్నారు. ఓ ఆంగ్ల పత్రికలో రిటైర్డ్‌ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కిరణ్‌ రిజిజు ట్విటర్‌లో ఇలా స్పందించారు.

‘ప్రజాభిమానం కలిగిన ప్రధానమంత్రినే నిత్యం నిందించే కొందరు వ్యక్తులు భావప్రకటన స్వేచ్ఛ గురించి ఏడుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విధించిన ఎమర్జెన్సీపై వాళ్లు ఎన్నడూ మాట్లాడరు. కొందరు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను విమర్శించే సాహసం కూడా వాళ్లు చేయరు’ అంటూ జస్టిస్‌ శ్రీకృష్ణను ఉద్దేశిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వ్యాఖ్యానించారు. అయితే, పేపర్లో వచ్చినవి మాజీ న్యాయమూర్తి చేశారో లేదో తెలియదు కానీ.. ఒకవేళ ఆయనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం అది ఆయన సేవలందించిన వ్యవస్థనే కించపరిచేలా ఉందన్నారు.

అంతకుముందు ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగాలేవు. ఒకవేళ నేనొక చౌరస్తాలో నిలబడి ప్రధానమంత్రి నాకు నచ్చలేదు అని చెబితే.. ఎవరైనా నాపై దాడులు చేయవచ్చు, ఎటువంటి కారణం చెప్పకుండానే అరెస్టు చేసి జైలులో పెడతారనే విషయాన్ని నేను తప్పక అంగీకరించాల్సిందే. పౌరులుగా మనమందరం వ్యతిరేకిస్తోంది ఇదే’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని