Ludhiana: లుథియానా పేలుడు ఘటన.. బాంబు పెట్టడానికి వచ్చిన వ్యక్తే మృతి!

పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టు సముదాయంలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Published : 24 Dec 2021 21:51 IST

కేసును ఎన్ఐఏకు అప్పగించే అవకాశం..!

లుథియానా: పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టు సముదాయంలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తే బాంబును అమర్చినట్లు తాజాగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలంలో ఫోన్‌, సిమ్‌కార్డును గుర్తించిన పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

సదరు వ్యక్తి కోర్టు రెండో అంతస్తులోని వాష్‌రూంలో ఐఈడీని అమర్చుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి అక్కడి నీటి పైపు పగిలిందని, దీంతో బాంబులోని ముఖ్య భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయని తెలిపాయి. పేలుడు కోసం ఆర్డీఎక్స్‌ను ఉపయోగించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే బాంబు పెట్టిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు జరిగిన ప్రాంతంలో ధ్వంసమైన ఓ ఫోన్, సిమ్‌కార్డును గుర్తించారు. వాటి ద్వారా ఆ వ్యక్తి వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

గ్యాంగ్‌స్టర్‌ సాయంతో పేలుడుకు కుట్ర..!

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ కేంద్రంగా కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు దీని వెనుక ఉగ్రవాద సంస్థ బబర్‌ ఖస్లా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారమిచ్చాయి. స్థానిక గ్యాంగ్‌స్టర్‌ అయిన హర్వీందర్‌ సింగ్‌ సాయంతో ఈ ముఠా.. పేలుడుకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని