ఇలాగే ఉంటే లాక్‌డౌన్‌ని తోసిపుచ్చలేం  

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త ......

Published : 03 Apr 2021 01:42 IST

కరోనా విజృంభణపై మహారాష్ట్ర సీఎం ప్రకటన

ముంబయి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్న వేళ శుక్రవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు. కొవిడ్‌ గొలుసును ఛేదించడంపై పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. తానూ లాక్‌డౌన్‌ కోరుకోవడంలేదని, కానీ పరిష్కారమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామన్నారు. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించకపోవడంతో కొందరు ఈ వైరస్‌ బారిన పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 2.5 లక్షల కొవిడ్ పరీక్షలు చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. కరోనాతో పరిస్థితులు క్షీణిస్తే వైద్య సదుపాయాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. వైరస్‌ తీవ్రతను బట్టి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ఇప్పటికే కొవిడ్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పలు జిల్లాలు/నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వంటి ప్రత్యేక ఆంక్షలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే. 

మహారాష్ట్రలో ఒక్కరోజులో 47వేల కొత్త కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ పగ్గాల్లేకుండా విస్తరిస్తోంది. నిన్న 43 వేల కేసులు నమోదైతే.. శుక్రవారం 47వేలకు పైగా కొత్త కేసులు రావడం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,827 కొత్త కేసులు, 202 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒక్క ముంబయి మహా నగరంలోనే 8,648 కేసులు, 20 మరణాలు వెలుగుచూశాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు 2,01,58,719 శాంపిల్స్‌ పరీక్షించగా.. 29,04,079 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 24,57,494 మంది కోలుకోగా.. 55,379 మంది మరణించారు. ప్రస్తుతం 3,89,832 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని