Jammu Kashmir: సీఆర్‌పీఎఫ్‌ అధికారి రైఫిల్‌ను ఎత్తుకుపోయిన ఉగ్రవాది..భద్రతా బలగాల గాలింపు

ఓ సీఆర్‌పీఎఫ్‌ అధికారి రైఫిల్‌ను ఉగ్రవాది ఎత్తుకుపోయాడు.ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగింది. ఉగ్రవాది కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి. 

Published : 01 Jan 2023 18:22 IST

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా సెక్టార్‌లో ఓ ఉగ్రవాది, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి రైఫిల్‌ను గుంజుకొని పారిపోయాడు. పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ 183వ బెటాలియన్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఇర్ఫాన్‌ గనీగా గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌తోపాటు అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాది కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని మార్గాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అతడికి ఆశ్రయం కల్పిస్తారని అనుమానమున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు.

ఇర్ఫాన్‌ గనీ తండ్రి షఫీకి చెందిన ఆస్తులను శనివారం జమ్ముకశ్మీర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవంతిపురా ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. మరోవైపు శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బగ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 2022వ సంవత్సరంలో 186 ఉగ్రవాదులతోపాటు, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయీబాకు చెందిన మరో 56 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు వార్షిక నివేదికలో వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌ రీజియన్‌లో ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారన్నదానిపై ఆయన మాట్లాడుతూ..విదేశీ ఉగ్రవాదులతో కలిపి దాదాపు 100 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు  చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. డీజీపీ వార్షిక నివేదికను వెల్లడించిన తర్వాతి రోజునే ఓ సీఆర్‌పీఎఫ్‌ అధికారి రైఫిల్‌ను ఉగ్రవాది ఎత్తుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని