Modi: కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన.. మోదీ ఆకస్మిక ‘తనిఖీలు’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రదాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే.

Updated : 14 Dec 2021 14:47 IST

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రదాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకూ సాగింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మోదీ నగరంలో లేట్‌ నైట్‌ టూర్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కొంతసేపు కాశీ వీధుల్లో నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘‘కాశీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించాం. ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బనారస్‌ రైల్వే స్టేషన్‌ను ప్రధాని సందర్శించారు.

అంతకుముందు నిన్న ఉదయం మోదీ గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని నడవా తొలి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం బ్యాటరీ పడవలో విహరిస్తూ నదీ తీరంలో హారతిని వీక్షించారు. 

మంగళవారం కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు మరోసారి భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమై ‘సుపరిపాలన’పై సెమినార్‌ నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా మహమందిర్‌ ధామ్‌ను సందర్శించనున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని