Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్‌ రౌత్‌

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీకి వస్తే చంపేస్తామని ఓ గ్యాంగ్‌స్టర్‌ తనను బెదిరించారని ఆరోపించారు. 

Published : 01 Apr 2023 12:49 IST

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut )కు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి తనకు ఈ బెదింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా మాదిరిగానే తననూ చంపేస్తామని (death threat) వారు హెచ్చరించారని రౌత్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi gang) గ్యాంగ్‌ పేరుతో కొందరు నాకు ఫోన్ చేసి బెదిరించారు. దిల్లీకి వస్తే ఏకే-47 తుపాకీతో కాల్చి చంపేస్తామని వారు హెచ్చరించారు. మూసేవాలాకు పట్టిన గతే నాకూ పడుతుందన్నారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా’’ అని రౌత్‌ మీడియాకు తెలిపారు. అయితే ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదని ఆయన ఆరోపించారు. ‘‘గతంలోనూ నాకు ఇలాగే బెదిరింపులు వచ్చాయి. కానీ రాష్ట్ర హోంమంత్రి ఇది కేవలం స్టంట్‌ అని కొట్టిపారేస్తున్నారు. ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని రౌత్‌ దుయ్యబట్టారు. (Sanjay Raut receives death threat)

కాగా.. రౌత్‌ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు (Mumbai Police) దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్‌ నంబరును ట్రేస్‌ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఇటీవల మరో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ నుంచి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని