
సూర్యుడిపై భారీ విస్ఫోటనం
భూమిని తాకనున్న శకలాలు
వాషింగ్టన్: జనవరి 2న సూర్యుడి దక్షిణార్ధ గోళంలో రెండు అయస్కాంత ఫిలమెంట్లు విస్ఫోటనం చెందినట్లు నాసా తెలిపింది. ఈ రెండు భారీ పేలుళ్లతో అనేక ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఉద్గారాల్లో కొన్ని భూమిని ఢీ కొట్టొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపై రేడియో, అయస్కాంత తరంగాలు ఒడిదొడుకులకు లోనవనున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడి కరోనా నుంచి ప్లాస్మా, అయస్కాంత తరంగాలు పేలడాన్నే కరోనిల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) అంటారు. ఈ రెండు సీఎంఈల బరువు బిలియన్ టన్నుల్లో ఉంటుంది. వీటిలో మొదటి సీఎంఈ నెమ్మదిగా ప్రయాణిస్తుండగా, రెండో సీఎంఈ సూర్యుడి నుంచి వేగంగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఉద్గారాలకు అయస్కాంత శక్తి ఉంటుంది. అందువల్ల అవి మరింత బలంగా తమ ప్రభావాన్ని చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఉద్గారాలు సూర్యుడి నుంచి దూరం వెళ్లే కొలది పరిమాణంలో పెద్దవిగా మారతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ సౌర పేలుళ్ల వల్ల అంతరిక్ష వాతావరణం ఒడిదొడుకులకు లోనుకావచ్చని నాసా వెల్లడించింది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.