Zydus Cadila: సూదిలేకుండా టీకా ఇలా.. వీక్షించండి..!

డస్‌ కాడిల్లాకు చెందిన తొలి డీఎన్‌ఏ టీకా  జైకోవ్‌డీకు కేంద్రం అత్యవసర అనుమతి మంజూరు చేసింది.  ఈ టీకా తీసుకోవాలంటే సూది అవసరం లేదు. దీంతో సూదిలేకుండా

Updated : 24 Aug 2021 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జైడస్‌ క్యాడిలాకు చెందిన తొలి డీఎన్‌ఏ టీకా  జైకోవ్‌డీకి కేంద్రం అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఈ టీకా తీసుకోవాలంటే సూది అవసరం లేదు. దీంతో సూదిలేకుండా టీకా ఎలా..? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే చర్మం పొరల మధ్యలోకి టీకాను పంపించేందుకు ఓ ప్రత్యేకమైన పరికరం ఇందుకోసం వాడనున్నారు. దీంతో సూదికి భయపడే వారు ఇప్పుడు నిర్భయం గా టీకాను వేయించుకోవచ్చు. ముఖ్యంగా జైడస్‌ టీకా 12ఏళ్ల పిల్లలకు కూడా ఇవ్వనుండటంతో వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

కొత్త టీకా విధానం ఏమిటీ..?

సూది రహిత టీకా విధానాన్ని ట్రోపిస్‌ అంటారు. దీనిని కొలారాడో కేంద్రంగా పనిచేసే కంపెనీ ‘ఫార్మా జెట్‌’ అభివృద్ధి చేసింది. 2017లో ఈ పరికరం వినియోగానికి ఐరోపాలో అనుమతలు వచ్చాయి. జైడస్‌ జైకోవ్‌డి టీకా ఇచ్చేందుకు కూడా దీనినే వినియోగించనున్నారు.

ట్రోపిస్‌లోని సూదిరహిత వ్యవస్థ ఇలా పనిచేస్తుంది..

ట్రోపిస్‌ టీకాను చర్మం పొరల మధ్యకు చేరుస్తుంది. ఇందు కోసం అత్యధిక ఒత్తిడితో చర్మంలోకి పంపిస్తారు. ఈ ప్రక్రియలో సూది వాడరు. ఈ ప్రక్రియలో మూడు పరికరాలు ఉంటాయి. ఇంజెక్టర్‌, నీడిల్‌ ఫ్రీ సిరంజ్‌, ఫిల్లింగ్‌ ఎడాప్టర్‌లను వినియోగిస్తారు.

టీకా వేసేందుకు నాలుగు దశల ప్రక్రియ ఉంటుంది. ఇంజెక్టర్‌ను సిద్ధం చేయడం, సిరంజిని నింపడం, ఇంజెక్టర్‌ను లోడ్‌ చేయడం, భుజం వద్ద ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. 

ప్రయోజనాలు ఏమిటీ..?

సూది రహిత ఇంజెక్షన్‌ విధానం మరింత సమర్థంగా పనిచేస్తుంది. కాకపోతే స్వల్ప శిక్షణ అవసరం. టీకా ఇచ్చేవారు.. తీసుకొనే వారు కంగారుపడాల్సిన అవసరం లేదు. సూది పోటుతో వచ్చే ఇబ్బందులు ఇందులో ఉండవు.  దీనిలో వాడిన నీడిల్‌ ఫ్రీ సిరంజ్‌ స్టెరిలైజ్‌ అయి ఉంటుంది. దానంతట అదే  నిరుపయోగంగా మారిపోతుంది. దీని పునర్వినియోగానికి అవకాశం లేదు. దీంతో సూది పునర్వినియోగంతో వచ్చే వ్యాధులు రావు.

సూదులతో సమస్యలు..

* ఏటా ఒక్క అమెరికాలోనే 8,00,000 మంది సూదులు కారణంగా గాయపడుతున్నారు.  

* ఏటా భూమిపై 500 మిలియన్ల వాడేసిన సూదులు చెత్తకుప్పలోకి చేరుతున్నాయి. వీటిల్లో 75 మిలియన్ల సూదులు పలు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నాయని అంచనా. 

* ఇంజెక్షన్‌ చేసే వైద్య సిబ్బంది  సూదుల కారణంగా 20 భిన్నమైన వ్యాధి కారకాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. వీటిల్లో హెచ్‌ఐవీ, హెపటైటస్‌ బీ,సీ వంటివి కూడా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని