NITI Aayog: నీతి ఆయోగ్‌ కొత్త సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

నీతి ఆయోగ్‌ (NITI Aayog) కొత్త సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ (Parameswaran Iyer) నియమితులయ్యారు.

Published : 24 Jun 2022 22:42 IST

దిల్లీ: నీతి ఆయోగ్‌ (NITI Aayog) కొత్త సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ (Parameswaran Iyer) నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న అమితాబ్‌ కాంత్‌ స్థానంలో పరమేశ్వరన్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2016 నుంచి ఈ స్థానంలో కొనసాగుతోన్న అమితాబ్‌ కాంత్‌ పదవీకాలం జూన్‌ 30తో ముగియనుంది. దీంతో నీతి ఆయోగ్‌ మూడో సీఈఓగా అయ్యర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో జారీ చేసింది.

పరమేశ్వరన్‌ అయ్యర్‌ 1981 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఆయనకు ప్రపంచ బ్యాంకు స్వచ్ఛత కార్యక్రమంలో అవకాశం రావడంతో పదేళ్ల క్రితం వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అనంతరం ఆయనను స్వచ్ఛభారత్‌లో ఎంతో కీలక విభాగమైన తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా 2017లో భారత ప్రభుత్వం నియమించింది. దీంతో పరమేశ్వరన్‌ అయ్యర్‌ అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు.

ఇదిలా ఉంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం (Planning Commission) స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2015లో జనవరిలో అమలులోకి వచ్చిన నీతి ఆయోగ్‌ తొలి సీఈఓగా సింధూశ్రీ ఖుల్లార్‌ ఏడాది పాటు కొనసాగారు. అనంతరం రెండో సీఈఓగా అమితాబ్‌ కాంత్‌ ఫిబ్రవరి 17, 2016న బాధ్యతలు చేపట్టారు. అయితే, రెండేళ్ల పదవీకాలమే అయినప్పటికీ ప్రభుత్వం జూన్‌ 30, 2019 వరకు పొడిగించింది. అనంతరం మరో రెండేళ్లు (జూన్‌ 2021) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదీ పూర్తైన తర్వాత మరోసారి పొడిగిస్తూ జూన్‌ 30, 2022 వరకు కొనసాగుతారని వెల్లడించింది. ఇలా మూడుసార్లు పొడిగింపు పొందిన అమితాబ్‌ కాంత్‌.. పదవీకాలం ముగియనుండటంతో కొత్త సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని