Bihar: తేజస్వి బిహార్‌ ముఖ్యమంత్రట.. నోరు జారిన సీఎం నితీశ్..!

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ టంగ్ స్లిప్‌ అయ్యారు. తన డిప్యూటీ తేజస్వీ యాదవ్‌ గురించి ప్రస్తావిస్తూ.. పొరపడ్డారు.

Updated : 28 Sep 2022 13:17 IST

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ టంగ్ స్లిప్‌ అయ్యారు. తన డిప్యూటీ తేజస్వీ యాదవ్‌ గురించి ప్రస్తావిస్తూ.. పొరపడ్డారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తేజస్విని ముఖ్యమంత్రి అనేశారు. అంతేగాకుండా తన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. 

మంగళవారం ఓ కార్యక్రమంలో నితీశ్‌ మాట్లాడుతూ.. ‘గౌరవనీయ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌’ అనేశారు. ఆ తర్వాత తన పొరపాటును సరిచేసుకోకుండానే ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ విషయం వెలుగులోకి రాగానే, భాజపా తన విమర్శలకు పదునుపెట్టింది. ‘స్పృహలో ఉండో, అనాలోచితంగానో తేజస్విని నితీశ్‌ ముఖ్యమంత్రిగా అంగీకరించినట్లు కనిపిస్తోంది. నితీశ్ ఆశ్రమానికి వెళ్లడానికి సరైన సమయం వచ్చింది’ అని భాజపా ప్రతినిధి నిఖిల్ ఆనంద్‌ ఎద్దేవా చేశారు. నితీశ్‌ను ఉద్దేశిస్తూ.. ఇటీవల ఆర్జేడీ నేత ఈ ‘ఆశ్రమం’ అనే పదాన్ని వాడారు. 70 ఏళ్ల వయస్సు అంటే ఆశ్రమానికి వెళ్లే సమయమని ఆ నేత వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ‘ప్రసంగాల్లో పొరపాటున నోరు జారిన వాటికి ప్రాధాన్యం ఉండదు. అప్పటి  ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా తన ప్రసంగంలో నెహ్రూను ప్రధాని అని సంబోధించారు. ఆర్జేడీతో జేడీయూ బంధం విషయంలో భాజపాను అసూయపడనివ్వండి’ అంటూ జేడీయూ కౌంటర్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని