Karnataka: లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు..!

బెంగళూరు: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడిలిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌ 19 కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో

Published : 04 Jul 2021 01:38 IST

బెంగళూరు: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడిలిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌-19 కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప శనివారం వెల్లడించారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేయడం సహా ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు అనుమతిస్తునట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందదని వెల్లడించారు. కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్టు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు విద్యాసంస్థలు మూసే ఉంటాయని తెలిపారు. సీటింగ్‌ సామర్థ్యాన్ని అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ సేవలు ప్రారంభమవుతాయని వివరించారు. పరిమిత సంఖ్యలో అతిథులతో రాజకీయ సమావేశాలు, వేడుకలకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద నుంచి రవాణా సేవలు కొనసాగుతాయన్నారు. 

సెకండ్‌‌ వేవ్‌లో రికార్డుస్థాయిలో రోజువారీ కేసులతో కర్ణాటకను కరోనా మహమ్మారి వణికించింది. రాష్ట్రంలో శుక్రవారం 2,984 కేసులు నమోదవగా.. బెంగళూరులో 593 కేసులు వెలుగుచూశాయి. అయితే కొద్ది రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని