Pak boat found: భారత జలాల్లోకి ప్రవేశించిన 10మంది పాక్‌ జాతీయుల అరెస్టు

సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి వచ్చేందుకు పాక్‌ వాసులు ప్రయత్నిస్తుండగా, వారి చర్యలను ఎప్పటికప్పుడు భారత దళాలు..

Published : 10 Jan 2022 01:53 IST

సముద్రమార్గం ద్వారా భారత్‌లోకి వచ్చేందుకు పాక్‌ వాసుల యత్నం

అహ్మదాబాద్‌: భారత్‌లోకి చొరబాట్ల రూపంలో పాక్‌ చేస్తున్న కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత దళాలు తిప్పికొడుతున్నాయి. భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 10 మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్‌ బోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ) రక్షణ ప్రతినిధి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి  ఐసీజీ షిప్‌ ‘అంకిత్‌’ అరేబియా సముద్రంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా ‘యాసిన్‌’ అనే పేరు గల పాకిస్థాన్‌ బోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బోట్‌లోని 10 మందిని గుజరాత్‌ తీరరక్షక దళం అదుపులోకి తీసుకున్నట్లు, విచారణ నిమిత్తం పోర్‌ బందర్‌కు తరలించినట్లు గుజరాత్‌ డిఫెన్స్‌ అధికారులు ట్విటర్‌లో పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్‌ 15న కూడా ఐసీజీ నిర్వహించిన ఆపరేషన్‌లో భారత జలాల్లోకి ప్రవేశించిన 12 మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్‌ బోట్‌ను అదుపులోకి తీసుకున్నారు. బోట్‌ల ద్వారా గుజరాత్‌ తీరం నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటుండగా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన డిసెంబర్‌ 20న గుజరాత్‌ తీరంలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఉగ్రవాద నిరోధక తనిఖీ బృందం నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తానీ ఫిషింగ్‌ బోట్‌లో సుమారు రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను తీసుకెళ్తుండగా భారత జలాల్లో పట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని