African Swine Fever: కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ కలకలం.. 685 పందుల హతం

కేరళ వయనాడ్‌ జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్ల్యూ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌తో రెండు ఫామ్‌లలోని 44 పందులు మృతిచెందాయి.......

Published : 27 Jul 2022 01:31 IST

తిరువనంతపురం: కేరళ వయనాడ్‌ జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్ల్యూ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌తో రెండు ఫామ్‌లలోని 44 పందులు మృతిచెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు జులై 25వ తేదీ నాటికి వయనాడ్‌లోని మనంతవాడీ మున్సిపాలిటీ సహా తవింజల్‌ గ్రామంలోని ఐదు ఫామ్‌లలోని 685 పందులను హతమార్చారు.

పశుసంవర్ధక శాఖలోని డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డాక్టర్ మినీ జోస్ వివరాల ప్రకారం.. కిలోమీటరు పరిధిలో విస్తరించి ఉన్న పందుల ఫామ్‌లలో కల్లింగ్ బృందం పనిని నిర్వహించి, ఆ ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు చేపట్టింది. ‘ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. చంపిన పందులను లోతైన గుంటలలో పాతిపెట్టారు’ అని జోస్ తెలిపారు. వీటి యజమానులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.

కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వెలుగుచూడటం ఇదే మొదటిసారి. దీంతో అధికారులు పందుల ఫామ్‌లపై దృష్టిసారించారు. వయనాడ్‌లో నమోదైన 244 ఫామ్‌లలో ప్రస్తుతం 4,740 పందులు, 6,454 పంది పిల్లలను మాంసం కోసం పెంచుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఫ్లూ ఇతర జంతువులకు గానీ, మనుషులకు గానీ విస్తరించే అవకాశం లేదని పశుసంవర్ధకశాఖ అధికారి డా.రాజేశ్‌ పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత వ్యాప్తి కలిగిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకితే ఆ పందులను చంపడం, ఆ ప్రాంతంలో కట్టడి చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని