Indigo: పోయిన లగేజీ కోసం.. ఇండిగో వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశాడు..!

విమాన ప్రయాణాల్లో లగేజీలు మర్చిపోవడం, మారిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే వాటి కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్నో ప్రయాసలు

Published : 31 Mar 2022 11:53 IST

ఎయిర్‌లైన్‌ స్పందన ఏంటంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌: విమాన ప్రయాణాల్లో లగేజీలు మర్చిపోవడం, మారిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే, వాటి కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్నో ప్రయాసలు పడి, ఫిర్యాదులు చేస్తే గానీ ఆ వస్తువులు తిరిగి రావు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రయాణంలో లగేజీ మారిపోయింది. దీనికోసం సదరు విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశాడు..! అసలేం జరిగిందంటే..

నందన్‌కుమార్‌ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత ఆదివారం నందన్‌ పట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత అతడి లగేజీ వేరే ప్రయాణికుడి లగేజీతో మారిపోయింది. రెండు బ్యాగులు అచ్చం ఒకేలా ఉండటంతో ఈ పొరబాటు జరిగింది. ఇంటికెళ్లాక ఈ విషయాన్ని గుర్తించిన నందన్.. ఇండిగో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశారు. అయితే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు చెప్పడం కుదరదన్న కస్టమర్ కేర్‌ ప్రతినిధులు.. ఆ వ్యక్తిని సంప్రదించి సమాచారమిస్తామని మాత్రమే చెప్పారు. 

ఒక రోజు గడిచినా ఇండిగో కస్టమర్‌ కేర్‌ నుంచి ఎలాంటి కాల్‌ రాలేదు. దీంతో సమస్యను తానే పరిష్కరించుకోవాలని నందన్‌ నిశ్చయించుకొన్నాడు. ఇండిగో వెబ్‌సైట్‌కు వెళ్లి తనతో పాటు ప్రయాణించి వారి వివరాలేమైనా దొరుకుతాయేమో అని వెతికారు. అయితే, ఎంత ప్రయత్నించినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇక చేసేదేం లేక, తన డెవలపర్‌ నైపుణ్యాలకు పనిపెట్టారు. ఇండిగో వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి తన లగేజీ తీసుకెళ్లిన ప్రయాణికుడి వివరాలను సంపాదించారు. అదృష్టవశాత్తూ ఆ ప్రయాణికుడు.. నందన్‌ ఇంటికి దగ్గర్లోనే ఉండటంతో ఇద్దరు కలుసుకొని లగేజీలు మార్చుకున్నారు.

ఈ విషయాన్నంతటినీ ట్విటర్‌లో రాసుకొచ్చిన నందన్‌.. చివరగా ఇండిగో ఎయిర్‌లైన్‌కు కొన్ని సూచనలు కూడా చేశారు. ‘మీ వెబ్‌సైట్‌ నుంచి సున్నితమైన వివరాలు లీక్‌ అయ్యే అవకాశాలున్నాయి. వాటిని సరిచేసుకోండి’’ అని సలహా ఇచ్చారు. నందన్‌ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.

ఇండిగో ఏమందంటే..

దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్‌ కూడా స్పందించింది. ‘‘కస్టమర్ల డేటా గోప్యత, సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలకు ఇండిగో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. బ్యాగేజీ వ్యవహారాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఐవీఆర్‌లో ప్రత్యేకంగా ఓ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచాం. ఒక్కో ఆప్షన్‌ను కస్టమర్‌ కేర్‌ సెంటర్‌లోని ఒక్కో బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. అయితే, మీరు ఆ ఆప్షన్‌ను వినియోగించుకోకుండా వేరే ఆప్షన్లను ఎంచుకున్నారు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మా కస్టమర్‌ కేర్‌ బృందానికి సమయం పట్టింది. గోప్యత విధానాల ప్రకారం.. మా కస్టమర్ల వివరాలను ఇతరులతో పంచుకోవడం కుదరదు. మీ బ్యాగేజీ తీసుకెళ్లిన వ్యక్తితో కాన్ఫరెన్స్ కాల్‌ ఏర్పాటు చేసేందుకు మా కస్టమర్‌ కేర్‌ టీం ప్రయత్నించింది. మా ఐటీ ప్రక్రియ పూర్తిగా దృఢంగా ఉంది. డేటా లీక్‌ విషయంలో ఇండిగో ఎప్పుడూ రాజీ పడదు. అయితే మీ ఫీడ్‌బ్యాక్‌ను మేం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

కొసమెరుపు..

నందన్‌ తన లగేజిని మార్చుకోవడానికి సహ ప్రయాణికుడిని కలిసిన సమయంలో ఇండిగో నుంచి కాల్స్‌ ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించాడు. దానికి ఆ ప్రయాణికుడు స్పందిస్తూ.. ఎటువంటి కాల్స్‌ రాలేదని చెప్పాడు. వాస్తవానికి కస్టమర్‌ కేర్‌ ఏజెంట్‌ మాత్రం ఆ ప్రయాణికుడికి తాము మూడు సార్లు కాల్‌ చేసినట్లు నందన్‌కు వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని