Updated : 22 Aug 2021 15:00 IST

Afghanistan: ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్లండి.. లేదంటే నా ప్రాణాలు నేనే తీసుకుంటా!

అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న ఓ మహిళ ఆర్తనాదం!

కాబుల్‌: ‘‘ఏ కారు మా దగ్గర నుంచి వెళ్లినా.. ఎక్కడ వారు(తాలిబన్లు) మమ్మల్ని లాక్కెళ్లి చంపేస్తారేమోనని భయమేస్తోంది. నేను మళ్లీ నా పిల్లల్ని చూస్తానో.. లేదో.. కూడా తెలియడం లేదు’’ ఇది అఫ్గానిస్థాన్‌లో ఉన్న ఓ అమెరికా మహిళ ఆర్తనాదం. తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన ఆ దేశంలో రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఏ క్షణం షరియా చట్టాన్ని అమల్లోకి తెస్తారేమోనని అక్కడి మహిళలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు.

ఇక అఫ్గాన్‌ పౌర ప్రభుత్వానికి, అమెరికా బలగాలకు సహకరించిన వారి భయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారంతా ఇప్పుడు ఆ దేశం నుంచి బయటపడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వారంతా వారి జీవితాల్లో ఓ అద్భుతం జరగాలనే ఆశిస్తున్నారు! అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం వీరి తరలింపు ప్రాణాలతో చెలగాటమే అన్నారంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నివాసం నుంచి బయటకు వెళ్లి ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం అంటే జీవితంతో చెలగాటమాడినంత పనవుతోంది. కాబుల్‌లోని ఏ ప్రాంతం నుంచైనా విమానాశ్రయానికి చేరుకోవాలంటే సాయుధులైన తాలిబన్‌ ఫైటర్లతో కూడిన 20 చెక్‌పోస్టులను దాటుకొని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఎవరిపైనైనా వారికి అనుమానం కలిగితే వారిని తాలిబన్లు అక్కడే కాల్చి పారేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ఓ మహిళ విమానాశ్రయానికి చేరుతున్న క్రమంలో తాలిబన్లు తనని కొట్టారని తెలిపారు. పక్కనున్న ఓ వ్యక్తిని అతని భార్యాపిల్లల ముందే కాల్చి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం తాను అఫ్గాన్‌కు చెందిన కొంతమంది పౌరులతో కలిసి ఓ ఇంట్లో తలదాచుకున్నానని తెలిపారు. బయటకు వస్తే ఎక్కడ కాల్చి చంపుతారేమోనని భయంగా ఉందన్నారు. ఎలాగైనా తమను రక్షించాలంటూ తీవ్ర దుఃఖంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను వేడుకున్నారు. ఈ మేరకు ఆమె ఓ ఆడియో సందేశాన్ని అమెరికాకు చేరవేశారు. దీన్ని వెస్ట్‌ వర్జీనియాకు చెందిన చట్టసభ సభ్యురాలు కారోల్‌ మిల్లర్‌ కార్యాలయం బహిర్గతం చేసింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా సదరు మహిళలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ అత్యంత దయనీయంగా మారుతున్నాయని.. ఆశలు కోల్పోతున్నామని ఆ మహిళ ఆవేదన చెందారు. ఇంటింటికీ వెళుతూ.. అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేసిన వారిని చుట్టుముడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాలిబన్లకు చిక్కడం కంటే.. తన జీవితాన్ని తానే అంతం చేసుకుంటానంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గంట గంటకి బతకడం కష్టంగా మారుతోంది. తాలిబన్లు ఏ క్షణమైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారనిపిస్తోంది. బైడెన్‌.. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. మాకు మీ సాయం కావాలి’’ అంటూ కన్నీటితో అర్థించారు.

ఆ మహిళ భర్త, కుటుంబ సభ్యులు ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నారు. ఏ క్షణం అఫ్గాన్‌లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే.. సంబంధాలు తెగిపోయి అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు బయటి ప్రపంచానికి తెలియవని కలవరపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆదేశాలు అందే వరకు ఎవరూ కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు రావొద్దని స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు అమెరికా మొత్తం 17 వేల మందిని అఫ్గాన్‌ నుంచి తరలించింది. వీరిలో 2,500 మంది అమెరికా పౌరులు ఉన్నారు. అఫ్గాన్‌లో 15000 మంది అమెరికా పౌరులు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరి తరలింపు కోసం మొత్తం 5,200 మంది సైనికులు పనిచేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు, విమానాశ్రయం చుట్టూ తాలిబన్‌ ఫైటర్ల పహారా.. తరలింపు ప్రక్రియను ఆటంకపరుస్తోంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని