Vaccination: నవ చరిత్రను లిఖించాం.. ‘100కోట్ల ఘనత’పై మోదీ 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా

Updated : 21 Oct 2021 13:19 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా మోదీ ఈ ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా లఖ్‌నవూలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు. పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియజేశారు.

* ‘‘టీకా పంపిణీలో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు. ఈ చరిత్రాత్మక రికార్డును చేరుకోవడంలో కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, టీకా తయారీదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అభినందనలు. ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోనివారు భయాలన్నీ పక్కనబెట్టి టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నా. మనమంతా కలిసి కరోనాను ఓడిద్దాం’’ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

* ‘‘100కోట్లు అంటే కేవలం ఒక సంఖ్య కాదు.. వంద కోట్లకు పైగా ప్రజల ఆత్మవిశ్వాసం. టీకా పంపిణీలో చిరస్మరణీయ ఘనత సాధించిన సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు’’ - కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

* ‘‘దేశంలో 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థ నాయకత్వం, ఆరోగ్య సిబ్బంది నిబద్ధత, కృషి, ప్రజల సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగాం. కరోనా ఓటమి తథ్యం’’ - యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని