G-20 Summit: మోదీ ఇండోనేషియా పర్యటన.. 45 గంటలు.. 20 భేటీలు

ఇండోనేసియాలో జరగనున్న జీ 20 సదస్సులో (G20 Summit) పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సోమవారం బయలుదేరనున్నారు. 45గంటలపాటు అక్కడ పర్యటించే మోదీ.. సుమారు 20 భేటీల్లో పాల్గొననున్నారు.

Published : 13 Nov 2022 21:56 IST

దిల్లీ: జీ 20 సదస్సులో (G20 Summit) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన బిజీబిజీగా కొనసాగనుంది. బాలీ ద్వీపంలో సుమారు 45గంటలపాటు పర్యటించే ప్రధాని మోదీ.. దాదాపు 20 భేటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

ఇండోనేషియాలోని బాలీలో నవంబర్‌ 15, 16 తేదీల్లో జీ-20 సదస్సుకు వేదిక సిద్ధమైంది. ఈ పర్యటన కోసం ప్రధాని మోదీ సోమవారం బాలీకి బయలుదేరతారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచాధినేతలతో మోదీ సమావేశవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ హెల్త్‌ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి అంశాలపై మోదీతోపాటు ఇతర నేతలు చర్చిస్తారని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని