MHA: ప్రధాని పర్యటనలో భద్రతాలోపం.. భఠిండా ఎస్‌ఎస్పీకి హోంశాఖ షోకాజ్‌ నోటీసులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ.. తాజాగా శుక్రవారం భఠిండా ఎస్‌ఎస్పీకి..

Published : 07 Jan 2022 23:37 IST

చండీగఢ్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ.. తాజాగా శుక్రవారం భఠిండా ఎస్‌ఎస్పీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో జనవరి 8లోగా  వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనకు సంబంధించి ఫిరోజ్‌పూర్‌లోని కుల్గర్హి పోలీస్‌ స్టేషన్‌లో 150 మంది నిరసనకారులపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఇదే క్రమంలో శుక్రవారం ఫిరోజ్‌పూర్‌కు వెళ్లిన కేంద్ర హోంశాఖ బృందం.. ప్రధాని పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న పంజాబ్ డీజీపీ సహా అధికారులందరినీ విచారించింది. ఫిరోజ్‌పూర్ కంట్రోల్ రూమ్‌లో వీఐపీ డ్యూటీని పర్యవేక్షిస్తున్న అధికారితోపాటు ఫిరోజ్‌పూర్‌, భఠిండా తదితర నాలుగు జిల్లాల ఎస్‌ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులనూ ప్రశ్నించింది. ఇదే అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సూచనలు జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని