Published : 27 May 2022 14:43 IST

PM Modi: గత పాలనలో సాంకేతికతపై ఉదాసీనత.. డ్రోన్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవంలో మోదీ

దిల్లీ: ప్రభుత్వ పాలనలో 2014 ముందువరకు సాంకేతిక వినియోగంపై ఉదాసీనత ఉండేదని.. దీని కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ఒక సమస్యగా చూశారని, అది పేదలకు వ్యతిరేకమని ముద్ర వేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపించారు. దిల్లీలో శుక్రవారం 'భారత్ డ్రోన్ మహోత్సవ్- 2022'ను ప్రారంభించిన ప్రధాని.. అనంతరం ఈ మేరకు ప్రసంగించారు. డ్రోన్ టెక్నాలజీపై దేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతంగా ఉందని, అభివృద్ధి చెందుతోన్న ఈ రంగం ఉపాధి కల్పనలో విస్తృత అవకాశాలను సూచిస్తోందని తెలిపారు. గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మారే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.

‘ఎనిమిదేళ్ల క్రితం మేం సుపరిపాలన కొత్త సూత్రాలను అమలు చేయడం ప్రారంభించాం. ‘కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన’ మార్గాన్ని అనుసరిస్తూ.. సులభతర జీవనం, వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరుకోవడంలో సాంకేతికత చాలా సాయపడింది. ‘డ్రోన్ సాంకేతికత’ ఎంత పెద్ద విప్లవానికి ప్రాతిపదికగా మారుతుందో చెప్పడానికి ప్రధానమంత్రి స్వామిత్వ పథకం ఒక ఉదాహరణ. దీని కింద మొదటిసారి గ్రామాల్లోని ప్రతి ఆస్తిని డిజిటల్ మ్యాపింగ్ చేసి, ప్రజలకు డిజిటల్ ప్రాపర్టీ కార్డులను అందజేస్తున్నాం. వ్యవసాయం, క్రీడలు, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది’ అని ప్రధాని అన్నారు.

టెక్నాలజీ రంగంలో భారత్‌ ఒకప్పుడు ఇతర దేశాలను అనుసరించేదని.. కానీ, ఇప్పుడు అగ్రగామిగా మారిందని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేదల ప్రయోజనానికి ఉపయోగపడినప్పుడే సాంకేతికత విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ టెక్నాలజీ అలాంటిదేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఉత్సవమైన ఈ కార్యక్రమం మే 27, 28 తేదీల్లో కొనసాగనుంది. ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. విదేశీ దౌత్యవేత్తలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, డ్రోన్ స్టార్టప్‌లకు చెందిన 1,600 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని