
Gandhi Jayanti: గాంధీ జీవితం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయి..
మహాత్ముడికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ప్రజలకు ఆదర్శమని ప్రముఖులు కొనియాడారు. బాపు 152వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీ పాత్ర ఎనలేనిదని కీర్తించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రీకీ నివాళులర్పించారు.
> బాపు పోరాటం, త్యాగాలను స్మరించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇది. గాంధీ బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను పాటిస్తూ.. మహాత్ముడు కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
> సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. బాపు మార్గాన్ని అనుసరిస్తూ, నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
> పూజ్య బాపు జీవితం, ఆయన ఆదర్శాలు.. దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి అవసరం. గాంధీ సూత్రాలు లక్షలాది మందికి బలాన్ని చేకూరుస్తాయి.- ప్రధాని నరేంద్ర మోదీ
> విజయం సాధించేందుకు ఒక్క సత్యాగ్రహీ చాలు. మహాత్మా గాంధీకి వినయపూర్వక నివాళులు. - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
> గాంధీ జీవితం నిరంతర త్యాగాల బాట. ప్రపంచాన్ని శాంతి, అహింస మార్గంలో నడిపించేలా ఇది ప్రేరేపిస్తుంది. బాపు.. స్వదేశీ, స్వభాష, స్వరాజ్ ఆలోచనలు ఎల్లకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
> జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. బాపు ఆలోచనలు కేవలం దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి సత్యం, అహింస, ధర్మ మార్గాలను బోధిస్తాయి. - దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
> జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా.. శాంతి, అహింసా ఆశయాలను ప్రజల్లో పెంపొందించడానికి, వాటిని వ్యాప్తి చేయడానికి కృషి చేద్దాం.- ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
> భారత స్వాతంత్య్రోద్యమ మహనీయుడు, అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి, గాంధీ. సత్యం, అహింస, ప్రేమ సందేశాన్ని అందించే 'బాపు' జీవితం, సామరస్యపూర్వక సమాజ స్థాపనకు బాటలు వేస్తుంది. - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్