BJP Leader Arrest: పోలీస్‌ వార్‌కు దారితీసిన భాజపా నేత అరెస్టు

దిల్లీలో ఓ భాజపా నేత అరెస్టు రాజకీయ దుమారానికి తెరలేపింది. భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ సింగ్‌ను ఈ ఉదయం పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి

Updated : 06 May 2022 15:16 IST

దిల్లీ, హరియాణా ఓ వైపు.. పంజాబ్‌ మరోవైపు

దిల్లీ/చండీగఢ్‌: దిల్లీలో ఓ భాజపా నేత అరెస్టు రాజకీయ దుమారానికి తెరలేపింది. భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ సింగ్‌ను నేటి ఉదయం పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను బెదిరించిన కేసులో ఈ అరెస్టు చోటు చేసుకొంది. అయితే ఈ అరెస్టు జరిగిన కొద్ది గంటల్లోనే దిల్లీ పోలీసులు.. పంజాబ్‌ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఇటీవల భాజపా యువ విభాగం నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తజిందర్‌ పాల్‌ సింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు దర్యాప్తునకు హాజరవ్వాలంటూ గతంలో పలుమార్లు తజిందర్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే వాటికి స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం దిల్లీలోని ఆయన స్వగృహంలో పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

రంగంలోకి దిల్లీ పోలీసులు..

ఈ అరెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని తజిందర్ తండ్రి దిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ పోలీసులు.. పంజాబ్‌ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. తజిందర్‌ అరెస్టు గురించి పంజాబ్‌ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని దిల్లీ పోలీసులు ఆరోపించారు.

అడ్డుకున్న హరియాణా పోలీసులు..

తజిందర్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు పంజాబ్‌ పోలీసులు మొహాలీకి తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరిని కురుక్షేత్ర వద్ద హరియాణా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అడ్డుకున్నారేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే దిల్లీ పోలీసుల సమాచారంతోనే హరియాణా పోలీసులు ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు.

భాజపా ఫైర్‌..

ఈ అరెస్టుపై భాజపా మండిపడింది. పంజాబ్‌ పోలీసులు దారుణంగా వ్యవహరించారని, కనీసం తజిందర్‌ తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని కాషాయ పార్టీ నేతలు విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్టుకు పాల్పడినట్లు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని