దేశవ్యాప్తంగా రైల్‌రోకో

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు ప్రకటించిన దేశవ్యాప్త రైల్‌రోకో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు జరపనున్నట్లు రైతు సంఘాలు గత వారం ప్రకటించాయి.

Updated : 18 Feb 2021 15:18 IST

పలు చోట్ల ఉద్రిక్తం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు ప్రకటించిన దేశవ్యాప్త రైల్‌రోకో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఈ  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు గత వారం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతు మద్దతుదారులు పట్టాలపై బైఠాయించి రైళ్లను స్తంభింపజేశారు. బెంగళూరులోని రైల్వే స్టేషన్లలోకి ఆందోళనకారులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిహార్‌లో రైతులు పట్టాలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పట్నా జంక్షన్‌లో రైతు సంఘాలు రైళ్లను అడ్డుకొన్నాయి.  రైల్‌రోకో సందర్భంగా అధికారులు రైళ్లను స్టేషన్లలోనే నిలిపివేశారు. పంజాబ్‌, హరియాణా, జమ్ముకశ్మీర్‌, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో రైతులు పట్టాలపైకి చేరుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు నినాదాలు చేశారు.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టేషన్లలోనే రైళ్లను నిలిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని వారు తెలిపారు. ఏ రైళ్లను రద్దు చేయలేదని వెల్లడించారు. దిల్లీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లోని పలు రైల్వే స్టేషన్ల సమీపంలో అదనపు బలగాలను మోహరించినట్లు ఆర్పీఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు.

శాంతియుతంగా రైల్‌రోకో: సంయుక్త కిసాన్‌ మోర్చా

తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని ఎస్‌కేఎం నాయకులు తెలిపారు. రైల్‌రోకో రాజకీయాలకు సంబంధించింది కాదన్నారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేస్తామన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవకుండా ఆహారం, నీరు అందిస్తామని వారు గురువారం ఉదయం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని