Rekha Singh: భర్త యుద్ధభూమిలో వీరమరణం పొందితే.. భార్య ఆయన కలను నిజం చేసింది..!

పెళ్లైన ఏడాదికే భర్త దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఒక్కసారిగా ఆమెకు చుట్టూ చీకట్లు కమ్మాయి.

Published : 07 May 2022 18:09 IST

దిల్లీ: పెళ్లైన ఏడాదికే భర్త దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఒక్కసారిగా ఆమెకు చుట్టూ చీకట్లు కమ్మాయి. అయితే ఆమె ఆ చీకట్లలోనే మగ్గిపోలేదు. దేశం కోసం ఆమె భర్త పడిన తపనే ఆమెను వెలుగువైపు నడిపించింది. ఆయన ఆశయం అందించిన ప్రోత్సాహంతో ఒంటరిగా కష్టపడింది. చివరకు భర్త కోరిక ప్రకారం ఆర్మీకి ఎంపికైంది. ఆమే లాన్స్‌ నాయక్ షాహిద్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్. 

2020, జూన్‌.. లద్దాఖ్ సరిహద్దులో గల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మందికి పైగా మన సైనికులు మరణించారు. అందులో లాన్స్‌ నాయక్ షాహిద్ దీపక్ సింగ్ కూడా ఉన్నారు. అప్పటికి ఆయనకు పెళ్లై.. 15 నెలలు మాత్రమే అవుతుంది. ఆయన భార్య రేఖా సింగ్ ఆ ఘటనతో తీవ్రంగా కుమిలిపోయింది. తాను ఒంటరినని ఆవేదన చెందింది. అంత బాధ అనుభవిస్తూ కూడా తన భర్త ఆశయాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆయనకు దేశసేవ చేయడమే ఇష్టం. ఆమెను కూడా ఆర్మీలో చేర్చాలని కలగన్నారు. వాటిని గుర్తు పెట్టుకున్న రేఖ.. తానున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి, ఆర్మీ పరీక్షలకు సిద్ధమైంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నా భర్త బలిదానం, దేశసేవ చేయాలనే ఆలోచన నన్ను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించాయి. కానీ, ఆ ప్రయాణం నాకు సజావుగా సాగలేదు. మొదటి సారి ఫిజికల్ టెస్టులో నేను ఉత్తీర్ణురాలిని కాలేకపోయాను. అందుకు నేనేమీ ధైర్యం కోల్పోలేదు. నా సన్నద్ధతను కొనసాగించాను. చివరకు ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాకు ఎంపికయ్యాను’ అంటూ రేఖ తన రెండేళ్ల కృషిని మీడియాకు తెలియజేశారు. ఇదిలా ఉండగా.. గల్వాన్‌ ఘటనలో అమరుడైన దీపక్‌కు కేంద్రం వీర చక్ర ఇచ్చి, గౌరవించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని