Tejaswi Yadav: ఎన్నికల వేళ డబ్బులు పంచిన తేజస్వీ యాదవ్‌.. జేడీయూ ఫైర్‌

బిహార్‌ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓ గ్రామంలో మహిళలకు

Updated : 10 Sep 2021 16:38 IST

పట్నా: బిహార్‌ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓ గ్రామంలో మహిళలకు ఆయన డబ్బులు పంచుతున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. దీనిపై అధికార జేడీయూ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఆర్జేడీ పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందంటూ దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

బిహార్‌ మాజీ ఎమ్మెల్యే దేవదత్త్‌ ప్రసాద్‌ వర్థంతిని పురస్కరించుకుని గోపాల్‌గంజ్‌లోని వైకుంఠపూర్‌లో తేజస్వీ యాదవ్‌ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కార్లో వెళ్తోన్న తేజస్వీ ఓ చోట ఆగారు. ఆయనను చూసేందుకు కొందరు మహిళలు రాగా.. వారికి రూ.500 చొప్పున డబ్బులు తీసి ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఈయన ఎవరనుకున్నారు.. తేజస్వీ యాదవ్‌.. లాలూజీ కా బేటా’ అని ఆ మహిళలకు పరిచయం చేశారు. దీంతో ఓ మహిళ ఆయన వద్దకు వెళ్లి తేజస్వీని ఆశీర్వదించింది. ఈ వీడియోను ఆర్జేడీ యూత్‌ విభాగం తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 

దీనిపై జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌ కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియోను తన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన నీరజ్‌.. ‘‘పేదలకు డబ్బులు పంచుతున్న ఆ రాకుమారుడు ఎవరో..? ఆయన గురించి అక్కడ ఎవరికీ తెలియకపోవడంతో లాలూ జీ కొడుకు అంటూ పరిచయం చేయాల్సి వచ్చింది. ఇలా డబ్బులు పంచినంత మాత్రానా మీ మీద ఉన్న చెడు అభిప్రాయం పోదు. మీరు పేద ప్రజలను ఎగతాళి చేస్తున్నారు. వెళ్లండి కొడుకు గారూ.. మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోండి’’ అంటూ ఎద్దేవా చేశారు.  

ఇదిలా ఉండగా.. బిహార్‌లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగా.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో తేజస్వీ డబ్బులు పంచడం వివాదాస్పదంగా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని