Raghav Chadha: రాఘవ్‌ చద్దాకు ‘ఇంటి’ కష్టాలు.. కోర్టుకెక్కిన ఆప్‌ ఎంపీ..!

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాజ్యసభ సెక్రటేరియట్‌ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

Published : 08 Jun 2023 20:18 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha)కు ‘బంగ్లా’ సమస్య ఎదురైంది. ఆయనకు కేటాయించిన అధికారిక బంగ్లా (official bungalow)ను రద్దు చేసిన రాజ్యసభ సెక్రటేరియట్‌ (Rajya Sabha Secretariat ).. నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. దీంతో చద్దా కింది కోర్టును ఆశ్రయించగా.. ఆ నోటీసుపై స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదం దిల్లీ హైకోర్టుకు వెళ్లనుంది. ఈ ఏడాది మార్చిలోనే చద్దాకు నోటీసులు రాగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాను బంగ్లా ఎందుకు ఖాళీ చేయమన్నారంటే..?

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా గతేడాది పంజాబ్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలిసారి ఎంపీ అయిన 2022 జులైలో టైప్‌-6 బంగ్లాను కేటాయించారు. అయితే, తనకు టైప్‌ 7 బంగ్లా కావాలని అభ్యర్థిస్తూ చద్దా గతేడాది ఆగస్టులో రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. అప్పట్లో ఆయన అభ్యర్థనను అంగీకరించిన రాజ్యసభ సచివాలయం.. సెంట్రల్‌ దిల్లీలోని  పాండారా రోడ్డులో ఉన్న టైప్‌ 7 బంగ్లాను కేటాయించింది. దీంతో ఆ బంగ్లాకు మరమ్మతులు చేయించుకున్న చద్దా.. తల్లిదండ్రులతో కలిసి గత నవంబరులో ఆ నివాసానికి మారిపోయారు. ఈ కేటాయింపును రాజ్యసభ అధికారిక గెజిట్‌లోనూ నోటిఫై చేశారు.

అయితే, రాఘవ్‌ చద్దా (Raghav Chadha)కు చేసిన బంగ్లా కేటాయింపును రాజ్యసభ సచివాలయం ఇటీవల రద్దు చేసింది. ఈ మేరకు బంగ్లా ఖాళీ చేయాలంటూ ఈ ఏడాది మార్చిలో నోటీసులు జారీ చేసింది. నిబంధల ప్రకారం.. ఎంపీలుగా ఎన్నికైన మాజీ కేంద్రమంత్రులు, మాజీ గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్లకు టైప్‌-7 బంగ్లాను కేటాయిస్తారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన వారికి టైప్‌-5 బంగ్లాను కేటాయిస్తారని రాజ్యసభ హౌసింగ్‌ కమిటీ (Rajya Sabha housing committee) ఛైర్మన్‌ సీఎం రమేశ్‌ తెలిపారు. దీంతో రాజ్యసభ సెక్రటేరియట్‌ నిర్ణయంపై రాఘవ్‌ చద్దా ఏప్రిల్‌లో దిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించారు. తన గళాన్ని అణచివేసేందుకు ఏకపక్షంగా తనకు ఆ నోటీసులిచ్చారని, దాన్ని అక్రమ నోటీసుగా ప్రకటించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతేగాక.. తనను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు గానూ రూ.5.50లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్యసభ సచివాలయం నోటీసులపై స్టే ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఈ అంశంలో మరింత లోతుగా వాదనలు వినాల్సి ఉంది. అయితే, న్యాయపరమైన ప్రక్రియ పూర్తికాకముందే రాఘవ్‌ చద్దా (Raghav Chadha)ను బంగ్లా నుంచి ఖాళీ చేయించడం.. ఆయనకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. దీనిపై జులై 10న తదుపరి విచారణ చేపడతాం. అప్పటివరకు చద్దాను బలవంతంగా ఖాళీ చేయించొద్దు’’ అని కోర్టు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యసభ హౌసింగ్‌ కమిటీ హైకోర్టులో సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ కేసు హైకోర్టు ముందుకు రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని