Char Dham Road: సైన్యం అవసరాలను కోర్టు ఊహించలేదు కదా..!

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టులో రహదారుల విస్తరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దేశ భద్రతకు ఇటీవల ఎదురైన తీవ్రమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని

Updated : 14 Dec 2021 14:43 IST

చార్‌ధామ్‌ రహదారి విస్తరణకు సుప్రీం ఓకే

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టులో రహదారుల విస్తరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దేశ భద్రతకు ఇటీవల ఎదురైన తీవ్రమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ల విస్తరణకు అనుమతినిస్తున్నట్లు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. సైనిక అవసరాలను న్యాయస్థానం అంచనా వేయలేదని పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ ప్రతి నాలుగు నెలలకోసారి ప్రాజెక్టుపై నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను అన్ని కాలాల్లోనూ చేరుకునే విధంగా 900 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక చార్‌ధామ్‌ ప్రాజెక్టును కేంద్రం రూ.12,000 కోట్లతో చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు చైనా సరిహద్దుల వరకు నిర్మిస్తున్న దృష్ట్యా.. దీనిపై గతంలో వెలువరించిన ఆదేశాలను(రోడ్ల వెడల్పును సగానికి తగ్గించాలని)సవరించాలని, రహదారిని 10మీడర్ల వెడల్పుతో విస్తరించేందుకు అనుమతించాలని రక్షణ మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను సవాల్‌ చేస్తూ ‘సిటిజెన్స్‌ ఫర్‌ గ్రీన్‌ డూన్‌’ అనే ఎన్జీవో కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై గతంలో సుప్రీంకోర్టు విచారణ జరపగా.. దేశ ఉత్తర భాగంలోని చైనా సరిహద్దుల వరకు సైన్యం క్షిపణి లాంఛర్లు, ఇతర భారీ ఆయుధాలను తరలించకుంటే.. ఒకవేళ యుద్ధం వస్తే ఎలా పోరాడగలమని కేంద్రం ప్రశ్నించింది. అందుకే వ్యూహాత్మక ప్రాంతాల్లో రహదారులను విస్తరించాల్సిన అవసరం ఉందని వాదనలు వినిపించింది. 

రక్షణశాఖ అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రహదారుల విస్తరణకు అనుమతినిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘రక్షణశాఖ చేసిన అభ్యర్థనలో ఎలాంటి దురుద్దేశాలు లేవు. సాయుధ బలగాల నిర్వహణ అవసరాలు, బలగాలు, ఆయుధాల తరలింపునకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయం తీసుకునే అధికారం రక్షణ మంత్రిత్వశాఖకు ఉంది. సరిహద్దుల్లో సరిపడా మౌలికసదుపాయాలు ఉన్నాయంటూ 2019లో ఆర్మీ చీఫ్‌ మీడియాకు చెప్పారని అప్పీలుదారులు అంటున్నారు. అదే శిలాశాసనమని చెప్పడం సరికాదు. కాలానుగుణంగా భద్రతా ప్రమాణాలు మారుతుంటాయి. ఇటీవల దేశ భద్రతకు సరిహద్దుల్లో తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రహదారి విస్తరణకు అనుమతినిస్తున్నాం. సాయుధ బలగాల మౌలిక సదుపాయాలను కోర్టు ఊహించలేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని