Influenza: మార్చి చివరి నాటికి ఇన్‌ఫ్లుయెంజా కేసులు తగ్గుముఖం.. కేంద్రం అంచనా

ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ((H3N2 Influenza Virus Cases)) కారణంగా దేశంలో మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి చివరి నాటికి ఇది తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Updated : 10 Mar 2023 20:27 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇన్‌ఫ్లుయెంజా ఉపరకమైన H3N2 వైరస్‌ కారణంగా మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కేసుల (H3N2 Influenza Virus Cases)పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న కేంద్రం.. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేసింది.

‘‘పలు రాష్ట్రాల్లో సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ వ్యాప్తి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ఉపరకమైన హెచ్‌3ఎన్‌2 (H3N2) వైరస్‌ తీవ్రత, మరణాల రేటును పరిశీలిస్తున్నాం. పిల్లలు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వృద్ధులు ఈ వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు ప్రపంచంలో అన్ని చోట్లా ఉన్నాయి. కొన్ని నెలల్లో ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రత వేగంగా ఉంటుంది. భారత్‌లోనూ ఏటా రెండుసార్లు దీని వ్యాప్తి కన్పిస్తుంది. అందులో ఒకటి జనవరి-మార్చి మధ్య ఉంటుంది. ఈ కేసులు మార్చి చివరి నాటికి తగ్గుముఖం పట్టే అవకాశముంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి: ఫ్లూ లక్షణాలివే.. ఈ పనులు చేయొద్దు..!

ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం.. హెచ్‌3ఎన్‌2 (H3N2) సహా పలు ఇన్‌ఫ్లుయెంజా (Influenza) ఉపరకాల కారణంగా దేశంలో 3,038 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఉపరకాల్లో హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కేసులు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటక, హరియాణాలో ఒక్కొక్కరు చొప్పున హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా మృతిచెందినట్లు ధ్రువీకరించింది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. అటు ఐసీఎంఆర్‌ కూడా మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది.

హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా (H3N2 Influenza) వైరస్‌ కారణంగా కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మరణించగా.. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. హరియాణాకు చెందిన వ్యక్తి ఈ ఏడాది జనవరిలోనే హెచ్‌3ఎన్‌2 (H3N2) వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇటీవల అతడు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఈ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దీని కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ.. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది. ఈ వైరస్‌ వల్ల ఆసుపత్రిలో చేరికలు తక్కువగానే ఉంటున్నా.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని