Ukraine crisis: భారతీయుల తరలింపునకు ముందుకొచ్చిన స్పైస్‌జెట్‌, ఇండిగో!

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మరికొన్ని విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి.....

Published : 01 Mar 2022 01:59 IST

దిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు మరికొన్ని విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. స్పైస్‌జెట్‌, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో సంస్థలు హంగరి రాజధాని బుడాపెస్ట్‌, రొమానియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి సోమ, మంగళవారాల్లో ప్రత్యేక విమానాలు నడపనున్నట్టు ప్రకటించాయి. రష్యా సేనల భీకర దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో  చిక్కుకుపోయిన భారతీయుల్ని శనివారం సాయంత్రం నుంచి రొమేనియా, హంగరి దేశాల నుంచి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమంలో భాగంగా తీసుకొస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌ గగనతలం మూసివేయడంతో ఆ దేశ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగరికి చేరుకుంటున్న భారత పౌరుల్ని ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆరు విమానాల్లో దాదాపు 1400 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. దాదాపు ఇంకా 14వేల మందికి పైగా పౌరులు అక్కడ చిక్కున్నట్టు అంచనా.

దీంతో బోయింగ్‌ 373 మ్యాక్స్‌ ప్రత్యేక విమానం ఈ సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరి బుడాపెస్ట్‌కు వెళ్తుందని స్పైస్‌జెట్‌ సంస్థ వెల్లడించింది.  కుటైసీ,  జార్జియా మీదుగా సేవలందిస్తుందని పేర్కొంది. మరిన్ని విమానాలను నడిపేందుకు వీలుగా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. అలాగే, బుకారెస్ట్‌ నుంచి ముంబయికి 182 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి విమానం బయల్దేరుతుందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. కువైట్‌లో ఇంధనం నింపుకొనేందుకు ఆగుతుందని, ఆ తర్వాత ఈ విమానం మంగళవారం ఉదయం 9.30గంటలకు ముంబయికి చేరుకుంటుందని వివరించింది. అలాగే, భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు వీలుగా తాము రెండు ఎ-321 విమానాలను నడుపుతామని ఇండిగో సంస్థ ప్రకటించింది. సోమవారం ఈ రెండు విమానాలు బుకారెస్ట్‌, బుడాపెస్ట్‌కు వెళ్లి.. ఇస్తాంబుల్‌ మీదుగా మంగళవారం దిల్లీ చేరుకుంటాయని ఇండిగో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని