NEET: నీట్‌ మినహాయింపు బిల్లుకు తమిళనాడు ఆమోదం

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.

Published : 13 Sep 2021 22:51 IST

చెన్నై: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. భాజపా మినహా అన్ని విపక్ష పార్టీలూ ఇందుకు ఆమోదం తెలిపాయి. భాజపా సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

నీట్‌ పరీక్ష భయంతో  పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందు ధనుష్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండుసార్లు నీట్​ రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకలేకపోతానేమో అన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరయ్యారు. నీట్‌ విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని వారు తప్పుబట్టగా.. ఆ విమర్శలను స్టాలిన్‌ తిప్పికొట్టారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కూడా నీట్‌ పరీక్ష నిర్వహించలేదని గుర్తుచేశారు. పళనిస్వామి సీఎం అయ్యాకే 2017లో తొలిసారి రాష్ట్రంలో నీట్‌ నిర్వహించారన్నారు. నీట్‌ మినహాయింపు బిల్లును కూడా గత అన్నాడీఎంకే ప్రభుత్వం తిరస్కరించిందని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని