Civil Service: మోదీజీ.. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి

కరోనా కారణంగా చివరి అవకాశం కోల్పోయిన  సివిల్‌ సర్వీస్‌ (Civil Service) అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Published : 08 Feb 2023 01:32 IST

చెన్నై: సివిల్‌ సర్వీస్‌ (Civil Service) అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోదీ (PM Modi)ని తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. ‘‘ సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థుల విన్నపాన్ని మరోసారి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. కరోనా కారణంగా చాలా మంది సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులు తమ చివరి అవకాశాన్ని కోల్పోయారు. అందువల్ల వారందరికీ వయోపరిమితిని పెంచుతూ మరో అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని స్టాలిన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా సిఫార్సు చేసిందన్న విషయాన్ని స్టాలిన్‌ తన లేఖలో ప్రస్తావించారు. వివిధ పార్టీల నుంచి దాదాపు 150 మందికి పైగా ఎంపీలు మద్దతు తెలిపారని అన్నారు. రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఉన్నత సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల కేంద్ర స్థాయిలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మూడేళ్లపాటు వయోపరిమితిని పెంచిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తు చేశారు. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఈ ఒక్కసారి మాత్రమే వయోపరిమితిని పెంచాలని దీనివల్ల ఆర్థికంగానూ పెద్దగా ఇబ్బందులు ఉండబోవని స్టాలిన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వేలాది మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీస్‌ కలను సాకారం చేసుకునే వీలుంటుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని