Chennai: సినీఫక్కీలో నటరాజ స్వామి విగ్రహం స్వాధీనం

దాదాపు 130 ఏళ్ల క్రితంనాటి 26.8 కేజీల నటరాజ విగ్రహాన్ని తమిళనాడు సీఐడీ పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం వారు విగ్రహాల ఎగుమతిదారుల అవతారం ఎత్తారు.

Published : 08 Nov 2022 00:40 IST

చెన్నై: దాదాపు 130 ఏళ్ల క్రితంనాటి 26.8 కేజీల నటరాజ విగ్రహాన్ని తమిళనాడు సీఐడీ పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం వారు విగ్రహాల  కొనేవారుగా అవతారం ఎత్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే కేరళలోని పలక్కాడ్‌కు చెందిన శివప్రసాద్‌ నంబూద్రి అనే వ్యక్తి మధ్యవర్తి ద్వారా నెలరోజుల క్రితం రూ.8 కోట్లకు నటరాజ విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు యత్నించాడని తమిళనాడు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వద్ద విగ్రహం ఉందో? లేదో తెలుసుకునేందుకు విగ్రహాలు కొనేవారుగా పరిచయం చేసుకొని ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఆధారాల కోసం ఆయనతో మాట్లాడిన ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశారు. గత నెలరోజులుగా ఈ తతంగం సాగుతోంది. ఒకసారి మాటల మధ్యలో 300 ఏళ్లనాటి నటరాజ విగ్రహం ఉందని, రూ.8కోట్లకు విక్రయించాలను కుంటున్నానని శివప్రసాద్‌ చెప్పేశాడు. అదే అదునుగా విగ్రహం కొనుగోలుకు కోయంబత్తూరు రావాలని కొనుగోలుదారుడిగా మాట్లాడుతున్న ఎస్సై పాండ్యరాజన్‌ అతడిని కోరారు. దీంతో నవంబరు 6న శివప్రసాద్‌ నంబూద్రి మరో వ్యక్తితో కలిసి కారులో కోయంబత్తూరు లోని పల్లాడం కూడలికి రాగానే.. ప్రణాళిక ప్రకారం ఏడీఎస్పీ జయంత్‌ మురళి నేతృత్వంలోని కొంత మంది పోలీసులు అక్కడ వారిని అడ్డగించి తనిఖీ చేపట్టారు. కారులో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డ్రైవర్‌తోపాటు శివప్రసాద్‌ను అరెస్టు చేశారు. మధ్యవర్తి ద్వారా విగ్రహం విక్రయించాలని ఇక్కడికి వచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ ఆపరేషన్‌లో భాగస్వాములైన పోలీసులను డీజీపీ శైలేంద్రబాబు అభినందించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని