Crime News: మహారాష్ట్రలో ఎదురు కాల్పులు: 26 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో

Updated : 13 Nov 2021 20:20 IST

గడ్చిరోలి: మహారాష్ట్ర గడ్చిరోలిలోని అటవీ ప్రాంతం మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. జవాన్లు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 26 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. జవాన్లు, మావోయిస్టులు పరస్పరం ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలిలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్‌ తెల్‌తుంబ్డే కూడా ఈ కాల్పుల్లో మరణించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎల్గార్ పరిషత్-భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పుణే పోలీసులు.. తెల్‌తుంబ్డేను వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చారు.

ఇద్దరు పౌరుల కాల్చివేత

మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్‌ఫార్మర్లనే అనుమానంతోనే మావోయిస్టులు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్​స్టేషన్​పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను సంతోశ్‌​(40), జగదీష్​ యాదవ్​గా (45) గుర్తించారు. గ్రామస్థులు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఘటనా స్థలంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని