Bombay High Court: వివాహితకు ప్రేమలేఖ.. ముమ్మాటికీ తప్పే

‘ఓ మహిళకు సచ్ఛీలతే విలువైన ఆభరణం. ప్రేమ పేరుతో వివాహితకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే’ అని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

Updated : 11 Aug 2021 10:41 IST

బాంబే హైకోర్టు తీర్పు

నాగ్‌పుర్‌: ‘ఓ మహిళకు సచ్ఛీలతే విలువైన ఆభరణం. ప్రేమ పేరుతో వివాహితకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే’ అని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలా చేయడం ఆమె నిబద్ధతను శంకించడమేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులోని నాగ్‌పుర్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహితకు ప్రేమలేఖ పంపిన వ్యక్తికి రూ.90 వేల జరిమానా విధించి.. అందులో రూ.85 వేలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. విషయం పూర్వాపరాల్లోకి వెళితే.. 2011లో ఓ కిరాణం షాపు యజమాని అక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించడంతో ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఆ చిట్టీని ఆమెపై విసిరి వెళ్లాడు. ఆ మర్నాడు మళ్లీ పిచ్చిచేష్టలతో ఆమెను విసిగించి, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు అకోలాలోని సివిల్‌లైన్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 జూన్‌ 21న సెషన్స్‌ కోర్టు నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.40 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మహిళ తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, తన షాపులో సరకులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెప్పాడు. ఆ డబ్బు అడిగినందుకే ఇలా అభియోగాలు మోపిందని ఆరోపించాడు. వాదనలు విన్న ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ఆధారాలు పక్కాగా ఉన్నాయని సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నిందితుడు అప్పటికే 45 రోజులు జైలుశిక్ష అనుభవించినందున శిక్షను ఏడాదికి తగ్గించి.. జరిమానాను రూ.90వేలకు పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని