Vaccination: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 100% వ్యాక్సినేషన్‌

అండమాన్‌ నికోబార్‌ దీవులు కొత్త రికార్డును నెలకొల్పాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ అందినట్లు అక్కడి పాలకవర్గం ప్రకటించింది....

Updated : 19 Dec 2021 14:01 IST

పోర్ట్‌బ్లెయిర్‌: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మాత్రం యుద్ధప్రాతిపదికన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అండమాన్‌-నికోబార్‌ దీవులు కొత్త రికార్డును నెలకొల్పాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ అందినట్లు అక్కడి పాలకవర్గం ప్రకటించింది. దీంతో కొవిషీల్డ్‌ టీకాతో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్ర/ కేంద్రపాలితం ఇదే కావడం విశేషం. 

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాక్సినేషన్‌ అత్యంత సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని అక్కడి పాలకవర్గం ట్విటర్‌లో తెలిపింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశామని పేర్కొంది. దట్టమైన అడవులు, కొండలను సైతం దాటుకొని ప్రతికూల వాతావరణంలోనూ టీకాలు అందజేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మంది టీకాలు అందాయి. ఇక ఆదివారం అక్కడ కొత్తగా మరో కరోనా కేసును నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం అక్కడ రెండు క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 7,701కి చేరింది. వీరిలో 129 మంది మరణించారు.

ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అర్హులందరికీ 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 53.87 లక్షల మంది అర్హులకు డిసెంబరు 5 నాటికి అందరికీ రెండు డోసుల టీకా అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని