Government of India: ఆ ప్రచారంలో నిజంలేదు.. నమ్మొద్దు: కేంద్రం

సుప్రీంకోర్టు ధర్మాసనాలను దేశంలోని మరో మూడు నగరాల్లో నెలకొల్పుతారంటూ వచ్చిన ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

Updated : 12 Aug 2021 09:38 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనాలను దేశంలోని మరో మూడు నగరాల్లో నెలకొల్పుతారంటూ వచ్చిన ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. దేశ రాజధాని దిల్లీకి వెలుపల సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా లేదని పలు సందర్భాల్లో పార్లమెంటుకు తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. చెన్నై, కోల్‌కతా, ముంబయిలలో సుప్రీంకోర్టు ధర్మాసనాల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందంటూ సామాజిక మాధ్యమం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఓ సందేశంపై నిజానిజాల నిర్ధరణ చేసుకోగా అది బూటకపు ప్రచారంగా తేలిందని పీఐబీ ట్వీట్‌ చేసింది. గత ఏడాది సెప్టెంబరులో రవి శంకర్‌ ప్రసాద్‌ కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. ‘‘సుప్రీంకోర్టు ధర్మాసనాలను దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దిల్లీ వెలుపల వాటిని నెలకొల్పేందుకు సర్వోన్నత న్యాయస్థానం సంసిద్ధత చూపలేదు’’ అని  సమాధానమిచ్చారు. లా కమిషన్‌ తన 229వ నివేదికలో...రాజ్యాంగ ధర్మాసనాన్ని దిల్లీలో, నాలుగు అనుబంధ ధర్మాసనాలను దిల్లీలో, చెన్నై/హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయిలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని