చైనా కుయుక్తులు.. సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు

భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు

Published : 15 Jul 2021 17:07 IST

వాస్తవాధీన రేఖ వద్ద సుదీర్ఘకాలం ఉండేందుకు డ్రాగన్‌ చర్యలు

దిల్లీ: భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్‌ శిబిరాలను నిర్మిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

ఉత్తర సిక్కిం నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా తమ భూభాగంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నకులా సెక్టార్‌లో గతేడాది భారత్‌, చైనా బలగాలకు ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కొద్ది మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక తూర్పు లద్దాఖ్‌, అరుణాచల్‌ సెక్టార్‌ల వద్ద కూడా చైనా వైపు ఈ తరహా అధునాతన భవన నిర్మాణలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

తూర్పు లద్దాఖ్‌ వంటి ఎత్తైన ప్రదేశాల్లో చలికాలంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉంటాయి. దీంతో చలికాలంలో ఈ ప్రాంతాల్లో చైనా తమ బలగాల్లో 90శాతం మందిని విడతల వారీగా మార్చాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బలగాల సౌకర్యార్థం సరిహద్దుల్లో చైనా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ శాశ్వత నిర్మాణాలతో సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పాటు బలగాలను మోహరించాలన్న డ్రాగన్‌ ఉద్దేశం స్పష్టంగా బయటపడుతోంది. అంతేగాక, సరిహద్దులకు వచ్చే రోడ్డు మార్గాలను కూడా చైనా మరింత మెరుగుపర్చింది. అంటే.. ఉద్రిక్తతల సమయంలో భారత్‌ కంటే ముందుగానే వచ్చి స్పందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో డ్రాగన్‌ మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది. 

తూర్పు లద్దాఖ్‌ ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య గతేడాది నుంచి ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో ఇరు దేశాల మధ్య ఘర్షణలతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల సైనికాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో వివాదం సద్దుమణగలేదు. అయితే తూర్పు లద్దాఖ్‌లో ఇరువైపులా బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో పాంగాంగ్‌ సరస్సు నుంచి బలగాలను వెనక్కి పిలిచిన డ్రాగన్‌.. వారిని టిబెట్‌కు తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని