China Lockdown: కొవిడ్‌ విజృంభణ..అధికారులపై వేటు వేస్తోన్న చైనా!

వైరస్‌ కట్టడిలో విఫలమయ్యారంటూ అక్కడి అధికారులపై చైనా వేటు వేసింది.

Published : 24 Dec 2021 18:37 IST

కఠిన ఆంక్షలు కొనసాగిస్తోన్న చైనా అధికారులు

బీజింగ్‌: జీరో కొవిడ్‌ (Zero Covid) వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. వైరస్‌ కట్టడికి కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జియాన్‌ నగరంలో కేసుల సంఖ్య పెరగడంతో నగరం మొత్తం లాక్‌డౌన్‌ విధించింది. ఇదే సమయంలో వైరస్‌ కట్టడిలో విఫలమయ్యారంటూ ఏకంగా 26 మంది అధికారులపై వేటు వేసింది. వచ్చే ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్‌ (Winter Olympics)కు సిద్ధమవుతోన్న చైనా.. ప్రధాన నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతోంది. దీంతో కొవిడ్‌ ఆంక్షలు కఠినతరం చేయడంతో పాటు వైరస్‌ నియంత్రణ చర్యల్లో విఫలమైన అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.

చైనాలో పెద్ద నగరాల్లో ఒకటైన జియాన్‌లో ఇటీవల ఒక్కరోజే 49 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. వారంలోనే కేసుల సంఖ్య 250కు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 1.3కోట్ల జనాభా ఉన్న నగరంలో పూర్తి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. నిత్యావసరాల కోసం రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైరస్‌ కట్టడిలో విఫలమయ్యారనే కారణంతో తాజాగా 26మంది అధికారులపై వేటు వేసినట్లు అక్కడి కేంద్రీయ క్రమశిక్షణ తనిఖీ కమిషన్‌ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, అధికారులతో సమన్వయం పరచుకోవడంలో విఫలమయినందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ నియంత్రణలో వైఫల్యం చెందిన అధికారులను మందలించడం లేదా తొలగించడం వంటి చర్యలు చైనా గతకొంతకాలంగా చేపడుతూనే ఉంది. ఈ మధ్యే ఇన్నర్‌ మంగోలియాలో కొవిడ్‌ కేసులు పెరగడంతో అక్కడి ఉన్నతాధికారిపై వేటు వేసింది. ఈ ఏడాది ఆగస్టులో షేంగ్‌జుహౌలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడంతో అక్కడి ఆరోగ్య కమిషన్‌ చీఫ్‌ను తొలగించింది. తాజాగా జియాన్‌ నగరంలో ఏకంగా 26మందిపై చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో జియాన్‌ నగరం నుంచి బీజింగ్‌తోపాటు ఐదు ప్రధాన నగరాలకు వైరస్‌ వ్యాపించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ వేగంగా వ్యాపించే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్‌ జరుగనున్న నేపథ్యంలో పలు నగరాల్లో వైరస్‌ విజృంభించడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని