Lockdown in China: చైనాలో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు..ప్రజల ఆకలి కేకలు..

కఠిన లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్తర జియాన్​ నగరంలోని 1.3కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు కరవై విలవిల్లాడుతున్నారు.......

Published : 04 Jan 2022 23:15 IST

బీజింగ్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కఠిన లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్తర జియాన్​ నగరంలోని 1.3కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు కరవై విలవిల్లాడుతున్నారు. తమ సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇల్లు దాటి వెళ్లనివ్వడంలేదు. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం కష్టతరమవుతోంది’ అని జియాన్‌కు చెందిన ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన గోడువెళ్లబోసుకున్నాడు.

అయితే అధికారులు మాత్రం ఇలాంటి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ప్రజలకు ఆహారం, వైద్యసదుపాయాలు సహా నిత్యవసరాలకు ఎలాంటి కొరతలేదని చెప్పుకొస్తున్నారు. నగరంలో కఠిన ఆంక్షలను విధించడాన్ని సమర్థించుకున్నారు. కొవిడ్​ వ్యాప్తిని అరికట్టాలంటే ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు. వింటర్‌ ఒలిపింక్స్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు యత్నిస్తున్నారు.

తగ్గినట్లే తగ్గి చైనాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. జియాన్ నగరంలో కొద్దిరోజులుగా మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తగా 1600లకు పైగానే కేసులు వెలుగుచూసినట్లు ప్రభుత్వ అధికార మీడియా తెలిపింది. ఇందులో అధికశాతం డెల్టా వేరియంట్‌ బారిన పడ్డవారే ఉన్నారని, తాజా ఒమిక్రాన్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని చైనా జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని