Delta Variant: భారత్‌లో ఇంకా డెల్టా వేరియంట్‌దే ఆధిపత్యం..!

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇప్పటికీ డెల్టా రకం ఆధిపత్యమే కొనసాగుతోందని కొవిడ్‌-19పై ఏర్పాటైన కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది.

Published : 22 Jul 2021 18:38 IST

వెల్లడించిన INSACOG

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ విలయానికి డెల్టా వేరియంట్‌ రకమే కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇప్పటికీ డెల్టా రకం ఆధిపత్యమే కొనసాగుతోందని కొవిడ్‌-19పై ఏర్పాటైన కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈరకం పాజిటివ్‌ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. అయితే, డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన డెల్టా ఉపరకాలు ఉన్నాయనడానికి ప్రస్తుతానికి ఎటువంటి రుజువులు లేవని INSACOG వెల్లడించింది.

‘దేశవ్యాప్తంగా కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా కేసుల నమూనాల్లో డెల్టా వేరియంట్‌ ప్రభావమే ఎక్కువగా కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగానూ వైరస్‌ విజృంభణకు ఈ రకమే కారణమవుతోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియాతో పాటు ఇతర దేశాల్లోనూ డెల్టారకం కేసులే ఎక్కువగా ఉన్నాయి’ అని INSACOG పేర్కొంది. అటు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడుతోన్న (Breakthrough Infection) వారిలోనూ డెల్టా రకమే అధికంగా (దాదాపు 90శాతం) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలింది. అయితే, పాజిటివ్‌ వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌తో 9.8శాతం కేసుల్లోనే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. ఇక మరణాల రేటు కేవలం 0.4శాతానికే పరిమితమయ్యిందని ఈ మధ్యే వెల్లడైన ఐసీఎంఆర్‌ నివేదిక వెల్లడించింది.

దేశంలో లాంబ్డా కేసులు లేవు..

డెల్టా ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు లాంబ్డా కేసులు మాత్రం వెలుగు చూడలేదని INSACOG స్పష్టం చేసింది. బ్రిటన్‌లో ఈ రకం వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేసింది.

ఇదిలాఉంటే, భారత్‌లో వైరస్‌ వ్యాప్తి తీరు, వాటి ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో 28జాతీయ ల్యాబ్‌లు కలిసి INSACOG కన్సార్టియంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరించి వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించే పనిని ఈ కన్సార్టియం చేపడుతోంది. తద్వారా కొత్త వేరియంట్లు, వాటి ప్రభావాలను అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని