Dholavira: ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో

Updated : 27 Jul 2021 17:26 IST

గాంధీనగర్‌: భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవలే తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. 

ధోలవిరా.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికత కాలంలో ప్రసిద్ధ పట్టణం ఇది. 5వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేది. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ఇది ఐదో అతిపెద్దది కావడం విశేషం. 

ఎంతో ఆనందకరమైన వార్త: మోదీ

ధోలవిరాను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన.. ఈ ప్రాంతంతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ‘‘కచ్చితంగా ఇది చాలా సంతోషకరమైన వార్త. ధోలవిరా చాలా ముఖ్యమైన పట్టణ కేంద్రం. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చరిత్ర, సంప్రదాయాలు, పురావస్తుశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో తొలిసారిగా ధోలవిరాకు వెళ్లాను. ఆ ప్రాంతాన్ని చూసి మైమరచిపోయాను. ఆ తర్వాత గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి అక్కడకు వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా బృందం పనిచేసింది’’ అంటూ నాటి ఫొటోలను ప్రధాని షేర్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని