Rajiv Gandhi Assassination: ఆ ఘోరకలి నా జీవితాన్ని మార్చేసింది

‘ఆ దుర్ఘటన నా దృక్పథాన్ని.. జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏం జరిగిందన్నది

Published : 03 Oct 2021 12:11 IST

రాజీవ్‌ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్‌
నాటి అనుభవం పుస్తకంగా తెస్తానని వెల్లడి  

చెన్నై: ‘ఆ దుర్ఘటన నా దృక్పథాన్ని.. జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నికల సభలో ఎల్టీటీఈ మానవబాంబు పేలి రాజీవ్‌తోపాటు మరో 14 మంది దారుణంగా మృత్యువాత పడ్డారు. నాటి ఘోరకలి నుంచి బతికి బయటపడ్డవారిలో ఇప్పటికీ సజీవంగా ఉన్నది నేనొక్కడినే. గత 30 ఏళ్లుగా నా సర్వీసు పొడవునా నన్ను వెంటాడిన ఈ భయంకరమైన అనుభవాన్ని ఓ పుస్తకంగా తీసుకువస్తా’ అని రెండు రోజుల కిందట చెన్నైలో డీజీపీ (ట్రెయినింగ్‌)గా పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రదీప్‌ వి.ఫిలిప్‌ ‘పీటీఐ’ వార్తాసంస్థకు తెలిపారు. 1991లో కాంచీపురం ఏఎస్పీగా ఉన్న ఫిలిప్‌ నాటి దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన టోపీ, నామఫలకం (బ్యాడ్జి) కింద పడిపోయాయి. వాటిని నేరస్థల సాక్ష్యాలుగా సేకరించారు. రాజీవ్‌ హత్యకేసు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ వస్తువులను కోర్టు కస్టడీలో పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు.. రూ.లక్ష పూచీకత్తు మీద సిటీ కోర్టు ఇచ్చిన అనుమతితో తన టోపీ, నామఫలకాన్ని పదవీ విరమణ వేడుక సందర్భంగా సర్వీసులో చివరిరోజైన సెప్టెంబర్‌ 30న ఫిలిప్‌ ధరించారు. రక్తపు మరకలంటిన ఈ రెండింటినీ చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

పీటీఐతో ఫిలిప్‌ మాట్లాడుతూ.. ‘ఈ టోపీ, బ్యాడ్జి.. నా రక్తం, చెమట, కన్నీళ్లకు సాక్ష్యాలు. 34 ఏళ్ల సర్వీసు మొదలైన తొలిరోజుల్లోనే ఎదుర్కొన్న భయానక అనుభవానికి నిదర్శనాలు. మరణం అంచులను చూపించిన ఈ దుర్ఘటన తర్వాత స్థాయి కోసం, అధికారం కోసం నేను ఎన్నడూ పాకులాడలేదు. ప్రజలకు నేను ఏం చేయగలను అనే ఆలోచించా. పోలీసు అధికారాన్ని మానవతాకోణంలోనే వాడా’ అని గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఫిలిప్‌ ప్రవేశపెట్టిన ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పోలీస్‌’ (ఎఫ్‌వోపీ) భావన బహుళ ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే 30 పుస్తకాలు రాసిన ఫిలిప్‌ ‘నేనింకా చేయాల్సింది చాలా ఉంది’ అని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని