Omicron Death: భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం..!

అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ వేళ.. దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది.

Published : 05 Jan 2022 22:30 IST

రాజస్థాన్‌లో ఓ వృద్ధుడు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడి

దిల్లీ: అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ వేళ.. దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధుడు ఒమిక్రాన్‌ నిర్థారణ అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆ వ్యక్తికి మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. డిసెంబర్‌ 31న ఈ మరణం చోటుచేసుకున్నప్పటికీ.. రాజస్థాన్‌ ప్రభుత్వం తాజాగా దీన్ని ధ్రువీకరించింది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి జ్వరం, దగ్గు రావడంతో డిసెంబర్‌ 15న స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు. అనంతరం జరిపిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. డిసెంబర్‌ 25వ తేదీన వచ్చిన ఫలితంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌గా నిర్థారణ అయ్యింది. ఈమధ్యలో డిసెంబర్‌ 21, 25న రెండుసార్లు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వాటిలో నెగటివ్‌గా తేలింది. అయినప్పటికీ పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ (డిసెంబర్‌ 31న) కన్నుమూసినట్లు ఉదయ్‌పూర్‌ అధికారులు ప్రకటించారు.

అయితే, ఆ వృద్ధుడు ఎక్కడికీ ప్రయాణం చేయలేదని.. రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న ఆ వృద్ధుడిని ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో చేర్పించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. అందుకే దీనిని కొవిడ్‌తో మరణించినట్లుగానే పరిగణిస్తున్నట్లు రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే, ప్రపంచ దేశాలను వేగంగా చుట్టుముడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 139 దేశాలకు వ్యాపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 108 మరణాలు సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో ఇప్పటికే 23 రాష్ట్రాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌.. ఇప్పటివరకు 2వేల మందిలో బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని