International Flights: ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి..!

అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్‌ అభిప్రాయపడినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

Updated : 24 Nov 2021 16:33 IST

దిల్లీ: అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్‌ వెల్లడించినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొంది. కొవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది లాక్‌డౌన వేళ.. అంతర్జాతీయ విమానప్రయాణాలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు, అత్యవసర సరకులు, ఔషధాల సరఫరాకు మినహా మిగతా విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం, టీకా కార్యక్రమం సజావుగా సాగుతుండటంతో ఆంక్షల్లో సడలింపులు వచ్చాయి. 

అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రక్రియపై కేంద్రం యోచన చేస్తోందని గత వారం ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ప్రపంచంలో పౌర విమానయాన రంగంలో భారత్‌ స్థానాన్ని తిరిగి పొందేందుకు సురక్షిత వాతావరణంలో కలిసికట్టుగా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోపక్క గత నెల నుంచి దేశీయంగా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పునఃప్రారంభించే ప్రక్రియలో భాగంగా పర్యాటక వీసాలను తిరిగి మంజూరు చేస్తామని గతనెల కేంద్రం ప్రకటించింది. దానిలో భాగంగా ఈ నెల 15 నుంచి వాటిని జారీ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని