Japan New PM: జపాన్‌ నూతన ప్రధానిగా ఫ్యుమియో కిషిదా..!

నూతన ప్రధానిమంత్రి అభ్యర్థి ఎంపికలో భాగంగా అధికార పార్టీ నాయకుడి ఎంపికలో జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిదా విజయం సాధించారు.

Updated : 29 Sep 2021 14:32 IST

అధికార పార్టీ నాయకుడిగా కిషిదా ఎంపిక

టోక్యో: జపాన్‌ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిడే సుగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ప్రధానిమంత్రి అభ్యర్థి ఎంపిక చేపట్టారు. జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిదా ఇందులో విజయం సాధించారు. వచ్చే వారం ఆయన జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత జపాన్‌ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిడే సుగా.. బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే తాను పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తిరిగి మరోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని తెలిపారు. గడిచిన ఏడాదిలో ప్రజాదరణ కోల్పోయిన నేతగా మిగిలిన సుగా.. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. సుగా చేసిన అనూహ్య ప్రకటన ఆయన పార్టీతో పాటు జపాన్‌ రాజకీయాల్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) తమ నూతన నాయకుడిని ఎన్నుకునేందుకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. ఇందులో పలువురు ఎల్‌డీపీ నేతలు పోటీలో నిలిచినప్పటికీ ఫ్యుమియో కిషిదాకు పార్టీలో భారీ మద్దతు లభించింది. దీంతో ప్రధానమంత్రిగా ఫ్యుమియో కిషిదా నియామకం ఖాయమయ్యింది.

జపాన్‌కు సుదీర్ఘ కాలంపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన షింజో అబే.. అనారోగ్య కారణాలతో గతేడాది ఆగస్టు నెలలో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. అనంతరం 72ఏళ్ల యోషిహిడే సుగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి పలు సవాళ్లు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం, అదే సమయంలో ఒలింపిక్స్‌ నిర్వహించడంపై విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో ప్రజల్లో ప్రస్తుత ప్రధాని సుగా పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో ఆయన పనితీరుకు రేటింగ్ 30శాతం తగ్గిపోయినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకొంటున్నట్లు సుగా ప్రకటించారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఫ్యుమియో కిషిదాకు ఇలాంటి సవాళ్లన్నీ స్వాగతం పలుకనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని