Omicron Scare: టీకా తీసుకోలేదా.. హోటల్స్‌, మాల్స్‌లోకి నో ఎంట్రీ..!

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తమిళనాడులోని మదురై నగరం ఆంక్షల కొరడా ఝులిపించింది. టీకా తీసుకోని వారు వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకుండా  శనివారం నిబంధనలు జారీచేసింది.

Published : 04 Dec 2021 13:21 IST

వచ్చేవారం నుంచి తమిళనాడు నగరంలో అమల్లోకి ఆంక్షలు

చెన్నై: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తమిళనాడులోని మదురై నగరం ఆంక్షల కొరడా ఝులిపించింది. టీకా తీసుకోని వారు వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకుండా శనివారం నిబంధనలు జారీచేసింది. మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులతో సహా 18 ప్రదేశాలకు అనుమతి నిరాకరించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా వేయించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.

‘ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా వేయించుకునేందుకు ఒక వారం సమయం ఇచ్చాం. ఆ గడువులోగా టీకా తీసుకోని వ్యక్తులు మాల్స్‌, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర వాణిజ్య సముదాయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు’ అని మదురై కలెక్టర్ అనీశ్ శేఖర్ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది కనీసం ఒక్కడోసు టీకా కూడా తీసుకోలేదని తెలిపారు. తమ దగ్గర 71.6 శాతం మందికి మొదటి డోసు.. 32.8 శాతం మందికి రెండో డోసు అందిందన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ ఒమిక్రాన్  వెలుగుచూసిన కర్ణాటక కూడా శుక్రవారం ఈ తరహా ఆంక్షలే తీసుకువచ్చింది. మాల్స్, సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి రెండు డోసుల టీకాను ఆ రాష్ట్రం తప్పనిసరి చేసింది.

కాగా, సింగపూర్‌, యూకే నుంచి తమిళనాడుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తమిళనాడులో తాజాగా 711 కొత్త కేసులు, 9 మరణాలు సంభవించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని