B.1.1529 Variant: దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌.. అసాధారణ స్థాయిలో మ్యుటేషన్లు!

దక్షిణాఫ్రికాలో మాత్రం అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురౌతున్న కొత్త వేరియంట్‌ (B.1.1529 )ను నిపుణులు గుర్తించారు.

Published : 25 Nov 2021 19:59 IST

అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్: కరోనా వైరస్‌ మహమ్మారి పలు దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్‌ పంపిణీ, కొవిడ్‌ ఆంక్షలతో వైరస్‌ వ్యాప్తిని చాలా దేశాలు కట్టడి చేయగలుగుతున్నాయి. కానీ, యూరప్‌ దేశాలు మాత్రం మరోసారి విలవిలలాడుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో మాత్రం అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురౌతున్న కొత్త వేరియంట్‌ను నిపుణులు గుర్తించారు. B.1.1529 పేరుగల ఈ వేరియంట్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు నిపుణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. కొత్త వేరియంట్‌పై చర్చించేందుకు గురువారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యింది.

కొవిడ్‌ దాటికి ప్రపంచంలోని చాలా దేశాలు కుదేలైనప్పటికీ.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్‌ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా పొరుగుదేశమైన బోత్సువానాలో కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) కూడా వెల్లడించింది.

భారీ సంఖ్యలో మ్యుటేషన్లు..

B.1.1529 పేరుతో పిలుస్తోన్న ఈ వేరియంట్‌ అసాధారణ రీతిలో భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురౌతున్నట్లు లండన్‌లోని యూసీఎల్‌ జెనెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఫ్రాంకోయిస్‌ బలౌక్స్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే దీర్ఘకాలిక హెచ్‌ఐవీ రోగిలో ఈ రకం ఉద్భవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ వేరియంట్‌ విస్తృతి ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.  మరికొంతకాలం వైరస్‌ ప్రాబల్యాన్ని పర్యవేక్షిస్తూ.. విశ్లేషించాల్సి ఉందని డాక్టర్‌ బలౌక్స్‌ వెల్లడించారు. భవిష్యత్తులో వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగితే తప్పితే.. ప్రస్తుతానికి ఈ రకంపై ఆందోళనపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని