Omicron: అంతర్జాతీయ ప్రయాణికులపాజిటివ్‌ కేసుల్లో80శాతం ఒమిక్రాన్‌వే..!

అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడుతోన్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నట్లు తెలుస్తోంది.

Published : 01 Jan 2022 01:37 IST

భారత్‌లో డెల్టాను అధిగమిస్తున్న కొత్త వేరియంట్‌ కేసులు

దిల్లీ: డెల్టా కంటే అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేసుల సంఖ్యలో డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ భర్తీ చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. అయితే, అందులో మూడోవంతు కేసుల్లో స్పల్ప లక్షణాలు కనిపిస్తుండగా మిగతా కేసులన్నీ లక్షణాలు లేనివేనని పేర్కొంది.

డిసెంబర్‌ 2వ తేదీన రెండు ఒమిక్రాన్‌ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలకే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించగా.. ఇప్పటివరకు 1270 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించిన ప్రభుత్వం.. వీటిని భారీ స్థాయిలో చేపట్టాలని 19 రాష్ట్రాలకు సూచించింది. వైరస్‌ ఉద్ధృతి పెరిగిన క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి, పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా సీనియర్‌ అధికారులు, నిపుణుల బృందాలతో చర్చిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వార్‌ రూంని ఏర్పాటు చేయడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో మెడికల్‌ ఆక్సిజన్‌, ఔషధాల నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ వేగం పెంచామని.. ఇప్పటికే 90శాతం అర్హులకు తొలిడోసు అందివ్వగా.. 64 శాతం మందికి రెండు డోసుల్లో ఇచ్చినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని