జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి.. ప్రముఖుల గైర్హాజరీపై విపక్షాల మండిపాటు

భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు.

Updated : 14 Nov 2021 15:58 IST

దిల్లీ: భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా నెహ్రూకు అంజలి ఘటించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహానేతకు నివాళులు అర్పించారు. దిల్లీలోని శాంతివనం నెహ్రూ స్మారకం వద్దకు వెళ్లిన సోనియా గాంధీ, భారత తొలి ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవలను స్మరించుకున్న సోనియా గాంధీ.. త్రివర్ణ రంగుల్లో ఉన్న బెలూన్లను గాలిలోకి విడిచిపెట్టారు. పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు కూడా నెహ్రూ స్మారకానికి నివాళులు అర్పించారు.

1889 నవంబర్‌ 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించిన నెహ్రూ.. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలకపాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన 1964 మే 27న తుదిశ్వాస విడిచారు. చిన్నారులను అమితంగా ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ విపక్షాలు..

నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రముఖుల జయంతి రోజు వారికి నివాళులు అర్పించేందుకు సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై మండిపడింది.

‘పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రముఖ నాయకుల చిత్రపటాల్లో ఉన్నవారి జయంతి రోజు వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, నెహ్రూ జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ రాలేదు. రాజ్యసభ ఛైర్మన్‌ కూడా గైర్హాజరు అయ్యారు. కనీసం ఒక్క కేంద్ర మంత్రి కూడా హాజరు కాలేదు. దీనికంటే దారుణం ఏమైనా ఉంటుందా..?అని రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జైరాం రమేష్‌ ట్వీట్‌కు తృణమూల్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ కూడా స్పందించారు. ఇందులో నాకేం ఆశ్చర్యం కలగడం లేదని.. పార్లమెంటుతో సహా దేశంలో గొప్ప వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడం ఇందుకు మినహాయింపు ఏమీ కాదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని